‘అమేజాన్’లో ఇంటి దొంగ! | online shopping website amazon cheated by some people | Sakshi
Sakshi News home page

‘అమేజాన్’లో ఇంటి దొంగ!

Published Wed, Jun 15 2016 8:42 PM | Last Updated on Thu, Jul 26 2018 1:56 PM

‘అమేజాన్’లో ఇంటి దొంగ! - Sakshi

‘అమేజాన్’లో ఇంటి దొంగ!

హైదరాబాద్: తక్కువ ధరకు వస్తువులంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బు చెల్లించిన వారికి రాళ్ళు, సబ్బు బిళ్ళలు పార్శిల్‌లో పంపి మోసం చేయడం లాంటి కేసులు చాలానే చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ ఆమేజాన్‌కే ఇద్దరు యువకులు టోకరా వేశారు. తనదైన పంథాలో దాదాపు రెండు నెలలుగా రూ.ఐదు లక్షలకు పైగా స్వాహా చేశారు. ఈ మోసగాళ్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఆ సంస్థకు చెందిన ఉద్యోగే ఉన్నారని, వీరి నుంచి ఆరు ఖరీదైన యాపిల్ ఐ-ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు.

మాజీ సహోద్యోగితో జట్టు కట్టి...
కాచిగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివసించే అంకుష్ బిరాజ్‌దర్, పాతబస్తీలోని పురానీహవేలీ ప్రాంతానికి చెందిన మీర్ ఫెరోజ్ అలీ అలియాస్ హసన్ గతంలో అబిడ్స్‌లోని ప్లే మ్యాక్స్ గేమింగ్ సెంటర్‌లో పని చేస్తుండగా వారికి పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అంకుష్ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమేజాన్‌లో ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్నాడు. సంస్థ ఆపరేషన్స్‌లో ఉన్న లోపాలు, వీటి ఆధారంగా జరుగుతున్న మోసాలను గుర్తించి యాజమాన్యాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన ఓ లోపాన్ని వినియోగించుకుని పని చేస్తున్న సంస్థకే టోకరా వేయాలని పథకం వేసి హుస్సేన్‌తో కలిసి రంగంలోకి దిగాడు.

ఆర్డర్ ఇవ్వడం... రిటర్న్ చేయడం...
వీరిద్దరూ కలిసి వివిధ పేర్లతో బోగస్ కస్టమర్ ఐడీలుగా వినియోగించడానికి ఈ-మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహేంద్ర బ్యాంకుల్లో హుస్సేన్ పేరుతో ఖాతాలు తెరిచి, అందులో అవసరమైన నగదును అంకుష్ డిపాజిట్ చేశాడు. ఒక్కోసారి ఒక్కో ఈ-మెయిల్ ఐడీ వినియోగించి అమేజాన్ నుంచి ఖరీదైన ఆరు యాపిల్ ఐ-ఫోన్లు బుక్ చేశారు. డెలివరీ కోసం వేర్వేరు ఫోన్ నెంబర్లు, చిరునామా ఇస్తూ వచ్చారు. పార్శిల్ తీసుకువచ్చిన సంస్థ డెలివరీ బాయ్స్ వీరిచ్చిన చిరునామాలు దొరక్కపోవడంతో ఫోన్‌లో సంప్రదించేవారు. దీంతో బాయ్స్ వద్దకే వెళ్ళి వస్తువులు తీసుకోవడం చేశారు.

చైనా ఫోన్లతో రిటర్న్ చేస్తూ...
ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు జరిపే ఈ సంస్థ వినియోగదారులకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఓ వస్తువును ఖరీదు చేసి, రిసీవ్ చేసుకున్న తర్వాత వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే ‘ఈజీ రిటర్న్’ పాలసీ అమలు చేస్తోంది. దీని ప్రకారం విషయాన్ని కంపెనీకి తెలిపి, డెలివరీ బాయ్స్‌కు వస్తువు అప్పగిస్తే... తక్షణం ఆన్‌లైన్‌లో చెల్లించిన మొత్తం కంపెనీ నుంచి వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. దీన్ని ‘క్యాష్’  చేసుకున్న ఈ ద్వయం అందుకున్న పార్శిల్‌లో ఉన్న ఐ-ఫోన్‌ను తీసేసి... దాన్నే పోలి ఉన్న చైనా ఫోన్ పెట్టేస్తోంది. ఆపై వివిధ కారణాలు చెప్పి రిటర్న్ చేస్తూ నగదును తమ ఖాతాలోకి జమ చేయించుకుంటోంది.

పక్కా సమాచారంతో చిక్కారు...
ఇలా చేతికందిన ఫోన్లను హసన్ తీసుకువెళ్లి అంకుష్‌కు అప్పగించేవాడు. వీటిని మార్కెట్‌లో అవసరమైన వారికి విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకునే వారు. రెండు నెలల కాలంలో దాదాపు రూ.5 లక్షల ఖరీదు చేసే ఆరు ఐ-ఫోన్లను ఈ ద్వయం అమేజాన్ నుంచి కాజేసింది. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో ఎస్సైలు జి.మల్లేష్, బి.మధుసూదన్, ఎస్కే జకీర్ హుస్సేన్, ఎన్.శ్రీశైలంతో కూడిన బృందం బుధవారం పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement