అల్పసంఖ్యాక వర్గాల కేటాయింపులపై రగడ
స్పీకర్ పోడియంను చుట్టు ముట్టిన విపక్ష సభ్యులు.. సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయిం పులు, నిధుల వ్యయంపై సభ అట్టుడికింది. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్తర్ చాంద్‌బాషా, అంజాద్ బాషా, ఎస్‌వీ మోహన్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, మహమ్మద్ ముస్తఫా తదితరులు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, విడుదల చేసినవి, ఖర్చు చేసిన వివరాలు ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానమిస్తూ.. 2014-15లో ఉపకార వేతనాలకు నిధులు ఖర్చు చేయలేదని, వివిధ పథకాల కింద రూ. 247 కోట్ల్ల బడ్జెట్ కేటాయిస్తే అంతకంటే ఎక్కువగా రూ.309 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
మంత్రి చూపించిన లెక్కలకూ వాస్తవ వ్యయానికీ పొంతన లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అంజాద్ బాషా, చాంద్‌బాషా మాట్లాడుతుండగానే మైకు కట్‌చేశారు. అలా మైకులు కట్ చేయడమేంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పీకర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అయినా స్పీకర్ స్పందించకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. తమకు అవకాశం ఇచ్చే వరకు కదిలేది లేదని సభ్యులు స్పష్టం చేయడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
పల్లె సవాలును అడ్డుకున్న యనమల: అంతకుముందు.. మంత్రి పల్లె మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమంపై తాను చెప్పిన వివరణ తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. పల్లె సవాల్‌ను మంత్రి యనమల అడ్డుకున్నారు. దీంతో సవాల్ నుంచి ఎందుకు పారిపోతున్నారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వ్యాఖ్యానించారు.