మైనార్టీల సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం | ycp leaders says minorities  welfare is ysrcp goal | Sakshi
Sakshi News home page

మైనార్టీల సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం

Published Thu, Jan 11 2018 10:40 AM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

ycp leaders says minorities  welfare is ysrcp goal - Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలు పాతబస్తీలోని రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం.. వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌతంరెడ్డి, బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. 

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా సహకరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు విధించి..ప్రజలకు మద్యం తాపిస్తూ ప్రాణాలను హరిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని.. అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో ఆర్థికంగా బలపడుతున్నారని విమర్శించారు. నమ్ముకున్న వారిని అమ్ముకుని పోయాడంటూ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురించి ఎద్దేవా చేశారు. జన్మభూమిలో రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారన్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరులో అధికారులను ఊర్లోకి కూడా రానీయలేదన్నారు. 

సాధ్యంకాని హామీలు గుప్పించడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నవరత్నాల వంటి పథకాలను రూపొందించారని తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.   నైతిక విలువలు కాపాడేందుకే  వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసమే జగన్‌మోహన్‌రెడ్డి ఎండనకా, వాననకా పాదయాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీనామా చేయించకుండానే 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. 

కర్నూలు  సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైఎస్‌ఆర్‌ కుటుంబం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మైనార్టీలంతా వైఎస్సార్‌సీపీ పక్షమేనన్నారు. మైనారిటీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదర్‌ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు పోవాలన్నారు. పార్టీ తల్లిలాంటిదని, గెలిపించిన పార్టీని వదలి మరో పార్టీలోకి చేరడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. పత్తికొండ నేత, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల్లో నుంచే నాయకుడు పుడతాడన్నారు. 

అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎ.రహ్మాన్, సంయుక్త కార్యదర్శి బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్‌.మద్దయ్య, జిల్లా నాయకురాలు విజయకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శ్రేణుల నాయకులు టి.వి.రమణ, కటారి సురేశ్‌కుమార్, మాజీ కార్పొరేటర్‌ దాదామియ్య, మహమ్మద్‌ తౌఫిక్, రాఘవేంద్రరెడ్డి, హరినాథ్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి,  సాంబశివారెడ్డి,  మల్లికార్జున, జాన్, లతీఫ్, బోదేపాడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement