
'జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా ఉండాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పటు ముసాయిదా శాస్త్రీయంగా లేదు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జిల్లాల ఏర్పటుపై ఏ ప్రాతిపదికన కసరత్తు చేశారో ప్రభుత్వం చెప్పలేదని శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తెలిపారు. జిల్లాల ఏర్పాటు అనేది '1974 ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్' మార్గదర్శకాల ప్రకారం జరగాలని వారు సూచించారు. అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకే జిల్లాలో ఉండాలని, అన్ని జిల్లాల్లో సగటు జనాభా ఒకేలా ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ ప్రక్రియ కోసం కొత్త జిల్లాల ఏర్పాటుపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
► హైదరాబాద్ను ఒకే జిల్లాగా ఉంచడం సరికాదని సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తెలిపారు. అలాగే, షాద్నగర్ను శంషాబాద్లో కలపొద్దని అఖిలపక్షం సందర్భంగా నేతలు సూచించారు.
► జనాభా ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు జరగాలని టీటీడీపీ నేతలు కోరారు. అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇవ్వాలని నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
► అఖిలపక్ష సమావేశం సందర్భంగా బీజేపీ నేతలు రామచంద్రారావు, మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఒక జిల్లాలోనే ఉండేలా జిల్లాల ఏర్పాటు ఉండాలన్నారు. అలాగే, కొత్త జిల్లాలకు కొమరం భీమ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారక్క, జయశంకర్ పేర్లు పెట్టాలని వారు సూచించారు.
► కొత్త జిల్లాల ఏర్పాటులో గద్వాల, జనగామ జిల్లాలపై ప్రజాభిప్రాయాలను గౌరవించాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. జిల్లాల విభజన పూర్తి శాస్త్రీయంగా ఉండాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.