ఉస్మానియా ఆసుపత్రి భవనం తొలగింపు?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. దాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించాలని.. ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రతిపాదిస్తూ ఫైలు పంపింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపితే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ అందుకు అంగీకరిస్తే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణమైన భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని కూల్చివేసి దానిస్థానంలో 24 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తారు.
‘ఉస్మానియా’కు వందేళ్లకుపైగా చరిత్ర..
1910 సంవత్సరంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసం నిర్మించారు. రెండంతస్తులున్న (జీ+2) ఈ భవ నాన్ని గతంలో పురావస్తు శాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపై వారసత్వ హోదా కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.