ఇలా అయితే మనది గ్లోబల్ సిటీ కాదు: కేటీఆర్
నగరంలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా చిన్నపాటి వర్షానికే రోడ్లు పాడైపోతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సోమవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితి కారణంగా.. 9 గంటలకు సమావేశానికి రావాల్సిన తాను 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని తెలిపారు.
అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకపోతే మనది గ్లోబల్ సిటీ కాదని ఆయన చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. రోడ్లు వేసిన వెంటనే వాటికి తూట్లు పొడుస్తున్నారని గుర్తుచేశారు. ఇకమీదట రోడ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.