ప్రేమించి.. పెళ్లి తర్వాత వేధించి | ove after marriage, harassing | Sakshi
Sakshi News home page

ప్రేమించి.. పెళ్లి తర్వాత వేధించి

Jul 23 2015 12:12 AM | Updated on Sep 3 2017 5:58 AM

ప్రేమించి.. పెళ్లి తర్వాత వేధించి

ప్రేమించి.. పెళ్లి తర్వాత వేధించి

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. హుమాయూన్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలు

భార్య, అత్తింటి వారిపై దాడి
 ముగ్గురికి తీవ్ర గాయాలు

 
గోల్కొండ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు.  హుమాయూన్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మాసబ్‌ట్యాంక్ పోచమ్మబస్తీకి చెందిన యాదయ్య కుమారుడు శివకుమార్(25), అదే బస్తీలో వాంబే గృహ సముదాయంలో నివసిస్తున్న ఉషారాణి కూతురు మనీషలు మే 1వ తేదీన రహస్యంగా యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన పదిహేను రోజుల నుంచి శివకుమార్ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మనీష  తల్లివద్దకు వచ్చేసింది. కక్ష పెంచుకున్న శివకుమార్ జూన్‌లో మనీష ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ఈ విషయంపై మనీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వస్తే,  చస్తానంటూ విద్యుత్ తీగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత కూడా శివకుమార్ పలుమార్లు మనీష, ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడిచేసే ప్రయత్నం చేశాడు.

ఈ విషయంపై మనీష పశ్చిమ మండలం డీసీపీకీ ఫిర్యాదు చేసింది. కాగా మంగళవారం రాత్రి 8 గంటలకు శివకుమార్ మనీష ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. నువ్వు ఏ పని చేయడం లేదు, కష్టించి సంపాదించే వరకు మనీషను పంపేది లేదని ఆమె తల్లి ఉషారాణి స్పష్టం చేసింది. దీంతో రెచ్చిపోయిన శివకుమార్ మనీష, ఆమె తల్లిని కొట్టి పారిపోయాడు. వెంటనే ఈ విషయంపై మనీష హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నానా హంగామా చేసిన శివకుమార్ తలను లాకప్ గోడలకు కొట్టుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు రాత్రి రెండు గంటల సమయంలో అతడ్ని వదిలేశారు.  నేరుగా రాత్రి 3 గంటల ప్రాంతంలో మనీష ఇంటికి వెళ్లాడు. రోకలి పట్టుకొని భర్తను ఎదిరించబోయిన మనీషను పిడిగుద్దులు గుద్దుతూ ఆమె చేతిలోని రోకలిని లాక్కొని హత్యాయత్నం చేశాడు. అడ్డువచ్చిన ఉషారాణి, మనీష అమ్మమ్మ మధురవీణలపై కూడా దాడి చేశాడు. ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఉస్మానియాకు తరలించి శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement