నేతన్నల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు | padmashali gharjana | Sakshi
Sakshi News home page

నేతన్నల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు

Published Mon, Feb 24 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

నేతన్నల సంక్షేమానికి రూ. 2,500  కోట్లు

నేతన్నల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు

 ‘పద్మశాలి గర్జన’ సభలో నేతల డిమాండ్
 రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలి
 చేనేత కార్మికులకు రూ. 1,000 పింఛన్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ. 2,500 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని.. రూ. 1,000 పింఛన్‌తో పాటు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ‘పద్మశాలి గర్జన’ సభ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పద్మశాలీల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ‘పద్మశాలి గర్జన’ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ... జనాభా నిష్పత్తి ప్రకారం బలహీన వర్గాల ప్రజలకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలన్నారు.
 
  బలహీన వర్గాలలో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగినప్పుడే అది సాధ్యపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చేనేత కార్మికులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తమ ఉత్పత్తులను మార్కెటింగ్ పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని పద్మశాలిల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ. 2,500 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి మాట్లాడుతూ... బలహీన వర్గాల ప్రజలు సంఘటితమైనప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాను రూ. 5 లక్షలకు పెంచాలని... రూ. 1,000 పింఛన్, కార్మికులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు మధుయాష్కీగౌడ్, రాజయ్య మాట్లాడుతూ... చేనేత కార్మికుల కోసం రూ. 300 కోట్లతో వరంగల్ జిల్లాలో జాతీయ స్థాయి టెక్స్‌టైల్ పార్క్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
 
 పద్మశాలీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ ద్వారానే పద్మశాలీల అభివృద్ధి సాధ్యమవుతుందని మంద కృష్ణమాదిగ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేబినెట్‌లో పద్మశాలీలకు ఒక్క మంత్రి పదవి కేటాయించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి మాట్లాడుతూ... రాబోయే ఎన్నికలలో పద్మశాలీలకు 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయపార్టీ పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అనిల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement