
వీణా-వాణీలను విడదీస్తే ప్రాణగండం
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్ర చికిత్స విషయంలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేతుతెల్తేశారు. తలలు అంటుకొని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వీణా-వాణీలను విడదీయడానికి శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని బ్రిటన్ కు చెందిన వైద్య బృందం తేల్చి చెప్పింది. ఆపరేషన్ చేస్తే వీణా-వాణీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైనా, నాడీ వ్యవస్థ కలిసి ఉండటంతో వాళ్లిద్దరూ కోమాలోకి వెళ్లడమో, నరాల క్షీణత, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
ఎయిమ్స్ వైద్యుల తాజా ప్రకటనతో నీలోఫర్ వైద్యులు డైలమాలో పడ్డారు. ఆపరేషన్ సంగతి పక్కన పెడితే ..ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులిద్దరి ఆలనాపాలన కూడా ప్రశ్నార్థకంగా మారింది. వారిద్దరికీ 13ఏళ్లు రావడంతో ఇక వారిని చూసుకోవడం తమవల్ల కాదని నిలోఫర్ వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో వీణా-వాణీల తాజా పరిస్థితులపై నీలోఫర్ వైద్యులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయానికి వచ్చారు. కాగా ఇప్పటి వరకూ ఏదో ఓ రోజు వీరిద్దరిని విడదీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తారన్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ వార్తతో అయోమయంలో పడ్డారు. తాము పేదవారిమని, వారిద్దర్ని పోషించే శక్తి తమకు లేదని చెబుతున్నారు.