
పండగంటే పండగే
పండగంటే ముచ్చట్లు... మురిపాలు. ఇల్లు..బంధువులు. పిండి వంటలు... విందులు... వినోదాలు. తీరిక లేని జీవనం... ఎవరికి వారుగా సాగుతున్న ప్రయాణంలో అచ్చతెలుగు సంబరాల్లోని అసలుసిసలు మజాను మిస్సవుతున్నారు నగరవాసులు. ముంగిళ్లు లేని ఇళ్లలో ముగ్గులు పెట్టడం సాధ్యం కానట్టే... కన్నవారికి దూరంగా ఉన్న చోట... కన్న బిడ్డలకు భోగి పండ్లు పోయాలన్నా మనసు రాదు. ఇలాంటి ఇబ్బందులను గ్రహించి... అంతా ఒకే కుటుంబంగా... ఆనందంగా సంప్రదాయబద్ధ్దంగా సంక్రాంతిని ఆస్వాదించడానికి బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఐదు రోజుల సంబరాలు చేస్తున్నారు. ప్రముఖ రచయిత చల్లా ఉమ నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి పండగ విశేషాలు ఆమె మాటల్లోనే...
తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థికంగా మెరుగైన అవకాశాలు కల్పించటం, ఆస్థిపాస్తులు సమకూర్చటంపై ఎక్కువ దృష్టి
పెడుతున్నారు. ఒక వేళ అవి ఇవ్వలేక పోతే పిల్లలకు అన్యాయం చేసినట్టుగా భావిస్తున్నారు. వాటన్నిటికన్నా పిల్లలకు ఇవ్వాల్సిన వారసత్వ సంపద భాషా, సంస్కృతి, సంప్రదాయాలు. వీటివల్లే వాళ్ల వ్యక్తిత్వానికి, అస్తిత్వానికి పునాదులు పడతాయి.
వీటిని వారసత్వంగా అందించలేకపోతే వారికి ఎక్కువ అన్యాయం చేసినట్టు. నగరాల్లో పిల్లలు ఇలాంటి పండగలు, సంప్రదాయాలకు దూరం కాకుండా ఉండడానికే ఈ సంక్రాంతి పండగ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఉద్యోగాలు, చదువుల వల్ల కుటుంబంలో ఒకరి కొకరు కలుసుకునే అవకాశాలు తక్కువవుతున్నాయి. చిన్నారులకు పండగంటే పిండి వంటలు, కొత్త బట్టలు, టీవీ... ఇవే తెలుసు. నగర యాంత్రిక జీవనం వల్ల ఏర్పడ్డ పరిస్థితి ఇది. ఈ క్రమంలోనే పూర్వంలా అంతా ఒకే కుటుంబంగా పండగ జరుపుకొనే వాతావరణం ఇక్కడ కల్పిస్తున్నాం. ఈ పండగ పిల్లల కోసమే అయినా... అభిరుచి ఉన్న తల్లిదండ్రులు కూడా వచ్చిన ఇందులో పాల్గొనవచ్చు.
ప్రాముఖ్యం తెలియాలి...
పండగ సందడి పిల్లలకు రుచి చూపించాలి. ఆ సందడిలో సంప్రదాయాలు తెలుసుకోవటం, భాషా, మానవ సంబంధాల వికాసం.. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిఉన్న అంశాలను వారు తెలుసుకోవాలి. ఇక్కడ చూసి, నేర్చుకుని, పెద్దయ్యాక ఈ సంప్రదాయాలను వాళ్ల పిల్లలకు నేర్పాలనేది మా ఆకాంక్ష. అలానే వచ్చినవారంతా ఎవరో చేస్తుంటే చూసి వెళ్లిపోకుండా... తలా ఒక పనిలో భాగస్వాములను చేస్తున్నాం. ఒకరు మామిడాకులు తెస్తే... మరొకరు రంగవల్లులకు రంగులద్దుతారు. అలా ఏంచేసినా కుటుంబంగానే చేయాలి. అప్పుడే అందులోని సంతోషం, గొప్పదనం తెలుస్తాయి.
బొమ్మల కొలువు...
3, 5, 7 ఇలా బేసి సంఖ్యలతో మెట్లు పెడతారు. పై మెట్టుపై దేవుడి బొమ్మలుంటాయి. జీవితంలో చూసే దృశ్యాలు, జంతువులు, పక్షులు, వృత్తులకు సంబంధించినవి, ప్రకృతి, సమాజంతో ఉండే అనుబంధాన్ని తెలిపేవి... ఇలా అంచలంచలుగా మానవ జీవిత సంబంధాలను ప్రతిబింబించేదే బొమ్మల కొలువు. ప్రస్తుతం ఇళ్లల్లో రోబోస్, రిమోట్ కార్లు, కార్టూన్ క్యారెక్టర్లతో కూడిన టెక్నో బొమ్మలే. మట్టి, కట్టె, లక్క బొమ్మలతో పిల్లలు ఆడుకోవటం చాలా తక్కువ.
ఇక బొమ్మల కొలువు సంప్రదాయం గురించి వారికి తెలిసేదెప్పుడు! ఇక్కడ అలా కాదు... ఎవరికి నచ్చిన బొమ్మలు వారే తెచ్చుకుని కొలువులో అలంకరిస్తున్నారు. సంక్రాంతి పండుగ వరకు ఇది కొలువుదీరుతుంది. బుధవారం సప్తపర్ణి ఆవరణలో తోరణాలు కట్టి, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టి, గంగిరెద్దుల వాళ్లని పిలిచి భోగి పండుగ జరుపుతున్నాం. సాయంత్రం సూర్యాస్తమయం లోపు అక్కడికి వచ్చిన చిన్నారులకు భోగి పండ్లు పోసి, మంగళ హారతులు పాడతారు. ఆ తరువాత సంప్రదాయబద్దంగా పేరంటమూ ఉంటుంది.