అవి పార్కులు.. మామూలుగా అయితే పచ్చని చెట్లు, మొక్కలు.. పిల్లల ఆట పరికరాలు.. ఆహ్లాదకర వాతావరణం ఉండాలి.. కానీ అక్కడ చెట్లు, మొక్కలు కాదుకదా గడ్డి కూడా ఉండదు.. అంతా చెత్తాచెదారం.. ఆ కాస్త భూమీ ఆక్రమణల మయం.. ఓ చోట వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోతే.. మరోచోట నివాస భవనాలు వెలిశాయి.. ఇక వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ భవనాలు భూత్ బంగ్లాలుగా మారిపోతున్నాయి.. ఇదీ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్ల దుస్థితి. పార్కులు, కమ్యూనిటీ హాళ్ల పరిస్థితిపై ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నో విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. – సాక్షి నెట్‌వర్క్
ఆనవాళ్లు కూడా లేకుండా..
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పేరుకు పార్కులు ఉన్నా.. చాలా చోట్ల వాటి ఆనవాళ్లు కూడా లేవు. పిల్లలకు క్రీడా వసతులు, ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్‌ల వంటివేమీ లేవు. పచ్చదనం కనుమరుగై, పరికరాలు తుప్పుపట్టిపోయినవి కొన్ని అయితే.. ఎడాపెడా కబ్జాల పాలవుతున్నవి మరికొన్ని. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలూ పార్కుల స్థలాల్లోనే..
ఇక స్థలాల కొరత పేరుతో.. చాలా చోట్ల పార్కుల స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. వనపర్తి, తాండూరు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పార్కు స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి.
పలుచోట్ల స్త్రీశక్తి భవనాలు, గ్రంథాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు పార్కు స్థలాలనే కేటాయిస్తున్నారు. ఇక బెల్లంపల్లి, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, బాన్స్‌వాడ తదితర మున్సిపాలిటీల్లో అసలు పార్కులే లేవు. ప్రస్తుతం అమృత్ పథకం కింద ఎంపికైన పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వందకుపైగా పార్కులు రూపుదిద్దుకోనున్నాయి. వాటికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు.
ఖాళీ జాగా.. వేసెయ్ పాగా
చాలా చోట్ల పార్కులు కబ్జాల పాల వుతున్నాయి. ‘ఇది ప్రభుత్వ భూమి’అని తెలిపే బోర్డు సహా దురాక్రమణకు గురవుతున్నా అడిగేవారు లేరు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మాత్రం పార్కులు, పార్కు స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. మిగతా ఏ జిల్లాలో నూ ఉద్యానవనాలు, వాటి స్థలాలు చేతులు మారడమో, కబ్జా కావడమో జరిగినట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
వరంగల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పార్కు స్థలాలపై అధికారుల వద్ద లెక్కాపత్రం కూడా లేకుండా పోయింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పార్కుల స్థలాల్లోనే గుడిసెలు, దుకాణాలు వెలిశాయి. వాటికి ఇంటి నంబర్లు కూడా ఇచ్చేయడం గమనార్హం. అలాంటి చోట తొలుత పేదల పేరుతో గుడిసెలు వేస్తున్నారు. కొంతకాలం తర్వాత భారీ భవంతులు నిర్మిస్తున్నారు.
పార్కు స్థలం.. ప్రైవేట్ స్కూల్ పార్కింగ్ ప్లేస్
మెదక్ జిల్లా కేంద్రం నడిబొడ్డున జంబికుంట వీధిలోని పార్కు స్థలం ఇది. దీని విలువ కోటి రూపాయలకు పైమాటే. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకులు ‘ఇది పార్కు స్థలం’అనే బోర్డు సహా ఆ స్థలాన్ని కబ్జా చేసేశారు. ఏకంగా ప్రహరీ కూడా కట్టేసి.. వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. కానీ ఇదేమిటని అడిగేవారెవరూ లేరు.
మనుగడ కోల్పోతున్న కమ్యూనిటీ హాళ్లు
మున్సిపాలిటీల పరిధిలోని వార్డులు, బస్తీలు, కాలనీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ప్రభుత్వపర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. సరైన నిర్వహణ లేక చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు స్త్రీశక్తి భవనాలుగా మారిపోగా.. చాలా తక్కువ భవనాలు మాత్రమే కమ్యూనిటీ హాళ్లుగా వినియోగంలో ఉన్నాయి. ఇక పదులకొద్దీ మున్సిపాలిటీల్లో అసలు కమ్యూనిటీ భవనాలే లేకపోవగం గమనార్హం. కొన్ని చోట్ల ఉన్నా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పది కమ్యూనిటీ భవనాలున్నా.. చిన్నపాటి కార్యక్రమం కూడా నిర్వహించలేనంత ఇరుగ్గా ఉండడం గమనార్హం.
మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇదీ..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీలో ఉన్న ఓ పార్కు మిషన్ భగీరథ పంపుహౌస్‌గా మారిపోయింది. సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, మెదక్ మున్సిపాలిటీల్లోని ఐదు పార్కుల్లో ఒక్క నిమిషం గడపలేని పరిస్థితి ఉంది. పాత ఖమ్మం జిల్లా పరిధిలోని పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ లోపించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 20 పార్కుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నా.. పనులు మొదలు కాలేదు. చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జా అయ్యాయి.
పాత రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల పార్కుల స్థలాలు కబ్జాల పాలయ్యాయి. తాండూరులో ఉన్న పార్కులో జిల్లా ఆస్పత్రిని నిర్మించారు. నిజామాబాద్ పట్టణంలో పేరుకు చాలా పార్కులున్నా ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయి. పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పేరుకే పార్కులు.. ఎక్కడా వసతులు లేవు. పలు చోట్ల పార్కుల కోసం ఉద్దేశించిన స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. కమ్యూనిటీ హాళ్లు అయితే పాడుబడిన బంగళాలను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా పార్కుల స్థలాలు పరాధీనమైపోయాయి. ఉన్న ఒకటి రెండు చోట్లా సౌకర్యాలేవీ లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇదే దుస్థితి. గోదావరిఖనిలో ఖాళీ స్థలంలో పార్కు, ఆస్పత్రి నిర్మాణంపై వివాదం నెలకొంది. లక్ష జనాభా ఉన్న జగిత్యాలలో ఒకే పార్కు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment