
బాబు గుళ్లనూ వదలడం లేదు
- వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి
- విచక్షణారహితంగా గుడులు, మసీదుల్ని కూల్చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న రాష్ట్ర రాజధానిలో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలతోపాటుగా దేవుళ్లకూ స్థానం లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతంలో విచక్షణారహితంగా టీడీపీ ప్రభుత్వం దేవాలయాల్ని, మసీదుల్ని కూల్చివేస్తోందని మండిపడ్డారు. గుళ్లనూ చంద్రబాబు వదలడం లేదని, దేవుడంటే ఆయనకు భయం లేదని విమర్శించారు. దేవాలయాలేగాక మసీదులనూ విచక్షణారహితంగా పడగొడుతున్నారన్నారు.
ఇప్పటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకు దేవాలయాల్ని, కొన్ని మసీదుల్ని పడగొట్టారన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకించినా, బంద్ పాటించినా, కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా దేవాలయాలు, మసీదుల్ని కూల్చేసుకుంటూ పోవడాన్ని తమపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విజయవాడలో సీతమ్మ పాదాలు, శనేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, సాయిమందిరం వంటివాటన్నింటితోపాటు రామవరప్పాడు మసీదును పడగొట్టడం దారుణమన్నారు. ఆ ప్రాంతంలోఉన్న ముస్లింలను రాత్రిపూట అరెస్టు చేసి మరీ కూల్చివేశారన్నారు.గోశాలకు చెందిన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చివేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
కేంద్రం.. మతసంస్థలు స్పందించాలి
దేవాలయాల్ని, మసీదుల్ని పడగొట్టడాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని పార్థసారథి కోరారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీవారు దేవాలయాల కూల్చివేతపైన వెంటనే స్పందించాలన్నారు. మసీదుల కూల్చివేతపైన ముస్లిం మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు స్పందించాలని కోరారు. అభివృద్ధి వద్దని తామనట్లేదని, అయితే అదేసమయంలో మతభావాల్ని గౌరవించాలని ఆయన అన్నారు.