
దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి: చిరంజీవి
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదం జరగటం దురదృష్టకరం.. విధిని ఎవరూ తప్పించుకోలేరని... సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవి అన్నారు. సామాజిక బాధ్యత గల వ్యక్తులుగా .. సీటు బెల్ట్ను పెట్టుకోగలిగితే ...ఇలాంటి ప్రమాదాలను ఎంతోకొంత తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
చిరంజీవి ఆదివారం ఉదయం జానకిరామ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే హరికృష్ణకు...ఇది రాకూడని కష్టమని, ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు. ఇటువంటి సంఘటనలు చూసి అయినా సరే కారు నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన సూచించారు.
మరోవైపు సినీనటి కవిత...జానకిరామ్ భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కళ్యాణ్రామ్, జానకిరామ్ ..రామలక్ష్మణుల్లా ఉండేవారని ఆమె అన్నారు. హరికృష్ణ గారికి ఈ సంఘటన తట్టుకోలేని విషయమేనని అన్నారు.