వచ్చే ఏడాదికీ ప్రణాళికలు
హరితహారంపై సమీక్షలో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
సాక్షి,హైదరాబాద్: హరితహారం లక్ష్యాలను సాధించడానికి కలెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టర్లతో జరిపిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. వచ్చే ఏడాదికి కూడా ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించుకొని మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణకు అవసరమైన నిధుల వివరాలను నెలవారీగా పంపాలని కోరారు. మొక్కలు నాటిన ప్రాంతాలకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి మొక్కను జియో రిఫరెన్సింగ్ ద్వారా ట్యాగ్ చేయాలన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో వెంటనే మొక్కలు నాటాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు.
భూసేకరణ వేగిరం చేయండి
రాష్ట్రంలో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని, ఇబ్బంది తలెత్తితే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రైల్వే, జాతీయరహదారుల విస్తరణపై ప్రధాని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.