ఆ బిడ్డ... ఆ దంపతులకు పుట్టిందే!
ఆ బిడ్డ... ఆ దంపతులకు పుట్టిందే!
Published Mon, Aug 21 2017 7:21 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM
♦ డీఎన్‌ఏ టెస్టుతో నిర్ధారణ
హైదరాబాద్: పేట్లబురుజు ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన సరోగసి శిశువు కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. సదరు పసికందు సరోగసీ ద్వారా జన్మించింది కాదని స్పష్టమైంది. ఆ బిడ్డ బాధితురాలు సుధారాణి అలియాస్ వెంకటమ్మ దంపతులకు జన్మించిన బిడ్డగా నిర్ధారణైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్ భార్య వెంకటమ్మ గర్భం దాల్చింది. నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆమెను భర్త లక్ష్మణ్ హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించాడు.
కేస్ షీట్‌లో పేరు నమోదు చేసే సమయంలో భర్త ఒక పేరు..భార్య మరో పేరు చెప్పడంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆరా తీయగా తన కడుపులో ఉన్నది సరోగసీ బిడ్డ అని, ఆడబిడ్డ అని తెలిసి సరోగసికి కారణమైన గుంటూరు దంపతులు ముఖం చాటేశారని తెలిపింది. దీంతో వైద్యులు జిల్లా వైద్యాధికారిణి పద్మజ సహా చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగి బాధిత దంపతుల నుంచే కాకుండా గుంటూరు దంపతుల నుంచి నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. బిడ్డ బాధితురాలు వెంకటమ్మ దంపతుల జన్యువుతో పోలికలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సరోగసీ కేసులో విచారణ కొనసాగుతోందని, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని చార్మినార్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
Advertisement