సంపన్న కుటుంబానికి చెందిన యువతి జల్సాలకు అలవాటు పడి మరో యువకుడితో కలిసి గొలుసు దొంగగా అవతారమెత్తింది.
బొల్లారం, న్యూస్‌లైన్: సంపన్న కుటుంబానికి చెందిన యువతి జల్సాలకు అలవాటు పడి మరో యువకుడితో కలిసి గొలుసు దొంగగా అవతారమెత్తింది. ఇప్పటివరకూ స్నాచింగ్ కింగ్‌లుగా పేరొందిన మగవాళ్ల స్థానంలో ఈ కి‘లేడీ’ ఇట్టే రాణించింది. పలువురి మహిళల పుస్తెల తాళ్లను తెంచేసిన మొట్టమొదటి లేడీ చైన్ స్నాచర్‌గా పేరొందింది. సిటీలో హాట్‌టాపిక్‌గా మారింది.
గత కొన్ని నెలలుగా ఖాకీలను ముప్పతిప్పలు పెట్టిన ఈమె ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ముంబై ప్రాంతానికి చెందిన ఈ యువతి(22) తన పాత మిత్రుడితో కలిసి హోండా యాక్టివా సాయంతో స్నాచింగ్‌లకు శ్రీకారం చుట్టింది. గతంలో నగరంలో ఉన్న ఈ యువతి తన విద్యాభ్యాసం అనంతరం కొద్ది రోజులు ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలో నగరంలో ఉన్న ఆమెకు పక్కింటి యువకుడితో పరిచయం ఏర్పడింది. సిటీ నుంచి ముంబై వెళ్లిన ఈ యువతి ఇటీవల నగరానికి తిరిగి వచ్చింది.
పాత మిత్రుడితో కలిసి సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. జల్సాలను తీర్చుకునేందుకు ఈ ఇద్దరూ చైన్ స్నాచింగ్‌లను ఆదాయమార్గంగా ఎంచుకున్నట్లు అదుపులో ఉన్న లేడి స్నాచర్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. యువతితోపాటు పట్టుబడ్డ యువకుడు సంపన్న కుటుంబానికి చెందిన విద్యార్థని తెలిసింది. వీరి నుంచి పోలీసులు 60 తులాల బంగారం రికవరీ చేసినట్లు సమాచారం.