
భారత్-పాక్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్
హైదరాబాద్: చాలా కాలం తర్వాత దాయాదులైన ఇండియా- పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగానేకాక పలు విదేశీ నగరాల్లోనూ భారీగా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇటు హైదరాబాద్ లోనూ భారీ సంఖ్యలో జూదగాళ్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే అప్రమత్తమైన పోలీసులు సాధ్యమైనంతమేర ఈ మహమ్మారిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఇండియా- పాక్ టీ20 మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను లంగర్ హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దాదాపు రూ. 25 లక్షల మేర బెట్టింగ్ సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు రాజేంద్రనగర్ హైదర్ గూడాలోని ఓ స్థావరంపై దాడిచేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.25 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీని స్వాధీనం చేసుకున్నారు. ఈ రాత్రిలోగా మరిన్ని దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్ల భరతం పడతామని పోలీసులు చెబుతున్నారు.