హైదరాబాద్: ‘రెండు కమిషనరేట్ల సరిహద్దుల్లో తిష్ట వేసి ఉంటున్న నేరస్తులు కార్డాన్‌సెర్చ్ సమయంలో పక్క కమిషనరేట్ పరిధిలో తల దాచుకుంటున్నారు... దీనికి చెక్ పెట్టేందుకే రెండు కమిషనరేట్ల సిబ్బందితో బుధవారం వేకువజామున పక్కాగా సోదాలు చేపట్టాం.. మున్ముందు ఇలాంటివే చేపడుతాం..’ దక్షిణ మండలం, శంషాబాద్ డీసీపీలు సత్యనారాయణ, సన్‌ప్రీత్‌సింగ్.
దక్షిణ మండలం, శంషాబాద్ జోన్ పోలీసులు సంయుక్తంగా ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ల సరిహద్దులో ఉన్న హసన్‌నగర్ రోడ్డులో బుధవారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం డీసీపీలు విలేకరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాలివీ... కార్డాన్‌సెర్చ్‌లో మొత్తం 585 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని రహదారులను దిగ్బంధించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సోదాలు కొనసాగించారు.
ఈ సందర్భంగా 1,100 ఇళ్ల తలుపులు తట్టిన పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలించారు. మొత్తం 101 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు కరుడుగట్టిన రౌడీషీటర్లు, ఒక గుడుంబా విక్రేత, హత్యాయత్నం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ముగ్గురు నిందితులు, 26 మంది బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు నాలుగు తల్వార్లు, మూడు డాగర్లు, 12 మంది బాల కార్మికులు, 120 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, ఒక కారును సీజ్‌చేశారు. పట్టుబడిన 26 మంది బిహారీలంతా ఇంద్రానగర్‌లోని గాజుల తయారీ కర్మాగారంలో పని చేసే బాల కార్మికులు.
వీరిని పనిలో పెట్టుకున్న యజమానిపై పి.డి.యాక్ట్ ప్రయోగిస్తామని డీసీపీలు తెలిపారు. పాతబస్తీలో ఇటీవల ఉగ్రవాద అనుమానితులు పట్టుబడిన నేపథ్యంలో ప్రజల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించి వారి భద్రతకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సెర్చ్ చేపట్టామన్నారు. దీంతో పాటు ఈ మధ్య కాలంలో బవారీయా చైన్ స్నాచింగ్ గ్యాంగ్ కూడా పాతబస్తీలో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడ్డారన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నేరాలకు చెక్ పెట్టేందుకు ఈ సోదాలు జరిపామన్నారు. కాగా, ఉగ్రవాద అనుమానితులు పట్టుబడుతున్న నేపథ్యంలో రెండు కమిషనరేట్ల పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్‌లో ఉగ్ర విషయాలకు సంబంధించి ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు.