నగరి ఉక్కిరిబిక్కిరి | Pollution devil | Sakshi
Sakshi News home page

నగరి ఉక్కిరిబిక్కిరి

Published Thu, Jan 14 2016 4:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

నగరి ఉక్కిరిబిక్కిరి

నగరి ఉక్కిరిబిక్కిరి

విశ్వనగరం వైపు వడివడిగా అడుగులేస్తున్న
 మహానగరం కాంక్రీట్ జంగిల్‌లా మారుతోంది. ఒకప్పుడు బాగ్(తోటల) నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరిలో హరితం కనుమరుగవుతోంది. మరోవైపు అవధులు లేకుండా కాలుష్య భూతం విస్తరిస్తోంది. పెరుగుతున్న మోటార్ వాహనాలు, పారిశ్రామిక కాలుష్యంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్యానికి కళ్లెం వేసే నేతలు ‘కాసుల’ వేటలో మునిగి తేలుతున్నారు. ఈ సారైనా విష మేఘాలను కట్టడిచేసే ‘గ్రేటర్’ నాయకులు రావాలని ఓటర్లు కోరుకుంటున్నారు.
..: సాక్షి, సిటీబ్యూరో,అంబర్‌పేట, కుత్బుల్లాపూర్
 
 హరిత హననం..
 1970 వరకు తోటలతో అలరారిన భాగ్యనగరం.. నేడు కాలుష్య కాసారంగా మారింది. ఇప్పుడు రహదారుల విస్తరణ, మెట్రోపనులు, బహుళ అంతస్తుల భవంతులు, నూతన కాలనీల ఏర్పాటుకోసం భారీగా చెట్లను నరికి వేస్తుండడంతో హరితం కనుమరుగవుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే  నగరంలో మిగిలి ఉన్న చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి.
 - ప్రొఫెసర్ జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త
 

 వాయువు ఆయువు తీస్తోంది..
 నగరంలో పీల్చే గాలిలో ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరగడంతో ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి-సీఓపీ(శ్వాస ఆడక ఇబ్బంది పడడం) వంటి  వ్యాధులు ప్రబలుతున్నాయి. చిన్న పిల్లల్లో ఊపిరితిత్తులు పెరుగుదల ఆగిపోతోంది. గర్భిణులకు తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు.
 - డాక్టర్ శ్యాంసుందర్‌రాజ్, పల్మనాలజిస్ట్
 
 అధ్వాన స్థాయిలో..
 హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఉందని జీహెచ్‌ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో సుమారు 8 శాతమే హరిత వనాలు ఉన్నాయి. వాస్తవానికి 30 శాతం ఉండాలి.
 
 అంతటా అదే తీరు..
 క్యూబిక్ మీటరు గాలిలో ధూళిరేణువులు(ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండబుల్ పర్టిక్యులార్ మ్యాటర్) వార్షిక సగటు 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ 2013, 2014, 2015లో ప్రధాన ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌పీఎం 100 - 140 మైక్రోగ్రాములు నమోదైనట్టు పీసీబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా సైనిక్‌పురి, కూకట్‌పల్లి,బాలానగర్, పంజ గుట్ట, ప్యారడైజ్, చార్మినార్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు ప్రాంతాల్లో ఈ స్థాయి అనూహ్యంగా 100 మైక్రో గ్రాములు  నమోదవడం గమనార్హం. మరోవైపు కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ మోతాదు ఘనపు మీటరు గాలిలో 90 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ ఈ ఉద్గారాలు 100కు మించుతున్నాయి.
 
 చెట్ల ఆకులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుండడంతో పీల్చేగాలిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది.
 ఇళ్లపై సోలార్‌పవర్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేలా సిటీజన్లను ప్రోత్సహించాలి. అందుకు సర్కారు తగిన సాయం అందించాలి.
 
 ప్రతి ఇంటి ఆవరణలో విధిగా ఐదు మొక్కలు నాటేలా స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాలు చర్యలు తీసుకోవాలి.
 
 ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించాలి. పేపర్ బ్యాగులను ప్రోత్సహించాలి.
 
 రసాయనాల రాజ్యం..!
  జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక వాడలో విపరీతంగా రసాయన పరిశ్రమలున్నాయి. ఘాటైన వాసనలతో ఇబ్బందులు.  రోడ్డెక్కితే వాహనాల పొగతో అనారోగ్యం పాలవుతున్నాం. పాలకులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ కాలుష్య రాజ్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఆ దిశగా చర్యలు తీసుకునే వారినే గెలిపిస్తాం.  
 ..: నిఖిత, సంధ్య, గాంధీనగర్
 
 కాలుష్య కాసారం.!
 సిటీ కాలుష్య కాసారంగా మారింది. బయటకు వెళ్తే భరించలేని పరిస్థితి. వాహనాల పొగ మనుషులను కమ్మేస్తోంది.  క్రెడిట్ కార్డు వెరిఫికేషన్ నా ఉద్యోగం. రోజూ చాలా ప్రాంతాలకు తిరుగుతుంటా. రోజూ నరకమే. పొగ చిమ్ముకుంటూ వాహనాలు వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. ఈ సమస్యపై నాయకులు దృష్టి పెట్టాలి. సరైన ప్రణాళికలు రూపొందించాలి. వారికే నా ఓటు.
 - అనిల్, క్రెడిట్ కార్డు ఎగ్జిక్యూటివ్
 
 హరితంతో కాలుష్యం దూరం..
 నగరంలో మిగిలి ఉన్న చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి.30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండే నూతన లే అవుట్లకే అనుమతులివ్వాలి.  
 
 సిటీజన్ల ఆరోగ్యానికి పొగ..
♦ ఆర్‌ఎస్‌పీఎం రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.
♦ దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా  దెబ్బతింటోంది.
♦ ఆర్‌ఎస్‌పీఎం మోతాదు క్రమంగా
♦ పెరుగుతుంటే ఊపిరితిత్తులకు క్యాన్సర్ తప్పదు.
♦ నగరంలో గంటపాటు ట్రాఫిక్ రద్దీలో ప్రయాణం చేసిన వారు చురుకుదనం కోల్పోయి నొప్పులతో బాధపడుతున్నారు.
♦ నగరంలో ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి వాయుకాలుష్యమే ప్రధాన కారణమని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement