హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులు కళకళలాడుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తోడవడంతో చెరువుల్లో నీరు చేరుతోంది. రాష్ట్రంలో ఉన్న 43వేలకు పైగా చెరువుల్లో ఇప్పటికే సగానికి పైగా చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరడం రైతులకు కొండంత భరోసానిస్తోంది. రెండేళ్లుగా వర్షాభావంతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని చెరువులన్నీ వట్టిపోయాయి. మొత్తం చెరువుల్లో 9వేలకు పైగా చెరువుల్లో చుక్క నీరు లేదు. 12వేల చెరువుల్లో 25శాతం కన్నా తక్కువగా నీరు చేరింది. దీంతో చెరువుల కింద ఎక్కడా ఆశించిన రీతిలో సాగు జరుగలేదు. అయితే ప్రస్తుత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం, ముఖ్యంగా ఆస్టు నెలలో కురిసిన వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులన్నీ నిండుకుండలుగా మారుతున్నాయి.
చిన్న నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం.. 43,842 చెరువుల్లో ఇప్పటికే 7729 చెరువులు పూర్తిగా నిండాయి. మరో 13,338 చెరువులు సగానికిపైగా నిండాయి. అయితే, కృష్ణా, గోదావరి బేసిన్లలో పరిస్థితి వేర్వేరుగా ఉంది. గోదావరి బేసిన్ పరిధిలోని సుమారు 18వేల చెరువులు నిండి ఉన్నాయి. ఇక 50శాతానికి పైగా నీరు చేరిన చెరువుల సంఖ్య సైతం 10వేలకు పైగా ఉండటం, రానున్న రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయన్న అంచనా ప్రభుత్వానికి, రైతాంగానికి సాంత్వన కలిగిస్తోంది. అయితే, కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. మెదక్ జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి.
పెరిగిన భూగర్భ జలమట్టం..
చెరువుల్లో పుష్కలంగా నీరు చేరటంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. భూగర్భ జల విభాగం తేల్చిన లెక్కల ప్రకారం గత నెల లెక్కలతో సరిపోలిస్తే ఈ నెల ఆదిలాబాద్ జిల్లాలో 7.04 మీటర్లు, కరీంనగర్‌లో 3.4మీటర్లు, ఖమ్మంలో 1.29 మీటర్లు, మెదక్ 2.99 మీటర్లు, నిజామాబాద్ 7.29 మీటర్లు, రంగారెడ్డి 6.5 మీటర్లు, వరంగల్‌లో 2.89 మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరిగిందని తేల్చింది. అయితే.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం భూగర్భ జలమట్టం పెరగకపోగా మరింత తగ్గాయని భూగర్భ శాఖ పేర్కొనటం గమనార్హం.
ఇరవై వేల చెరువులకు జలకళ
Published Fri, Sep 16 2016 5:29 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement
Advertisement