
పొన్నం ప్రభాకర్
న్యూఢిల్లీ: తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కావస్తున్నా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని, ఈనెల 16 జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వీటిపై నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. హర్యానాలో ఉన్న ఆయన ఈ మేరకు మంగళవారం ఓ బహిరంగ లేఖను రాశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతుల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలన్నారు. రోజుకో మెలిక పెడుతూ దాటవేత ధోరణి అవలంభించడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తక్షణం రూ.10 లక్షల ఆర్థికసాయం అందించడంతోపాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలన్నారు.
అదేవిధంగా వద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్ పెంపుపైనా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమయం, నిధులు అవసరమయ్యే అంశాలను తాము ప్రస్తావించడం లేదని, పైన పేర్కొన్న హామీలను నెరవేర్చేందుకు దష్టిపెట్టాలని కోరారు. లేదంటే ఈనెల 20 నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అంశాల వారీగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.