'ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్ఎస్ కలలు కంటోంది'
ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్ఎస్ కలలు కంటోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే అతృతలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ సీఎం పదవి దళితుడు, డిప్యూటీ సీఎం పదవి మైనార్టీలకు ఇస్తామని గతంలో కేసీఆర్ చేసిన హామీలు ఏ గాలికి కొట్టుకుపోయానని విమర్శించారు.
ఆ హామీలపై నోరు విప్పాలని పొన్నాల ఈ సందర్భంగా కేసీఆర్ను డిమాండ్ చేశారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ అభివృద్ధికి విఘాతం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్తో సీపీఐ పొత్తు కుదిరినట్లు విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పొన్నాల వెల్లడించారు.