బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతూ తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ ఎలా ఓటు వేస్తారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాకు చెందిన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ డివిజన్లో ఓటు వేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉంటే ఆ రాష్ట్రంలోని శాసనసభకు పోటీ చేయొచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం చెల్లుబాటు కాదని, అందువల్ల ఆయనను తక్షణం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం లోక్ సభకు పోటీ చేయడానికి దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నా సరిపోతుందని, కానీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాగే ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే సంబంధిత జిల్లాలో ఓటరై ఉండాలి. ఎన్నికల నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ బాలకృష్ణ మరో రాష్ట్రంలో ఓటు వేయడం చట్ట వ్యతిరేక చర్య అవుతుందని, తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు తన ఫిర్యాదును అందించారు.