
విద్యుత్ కోతకోచ్చింది
వేసవి ఛాయలు పూర్తిగా కనిపించడమే లేదు... కానీ విద్యుత్ శాఖ జనానికి చెమటలు పట్టిస్తోంది. అనధికారిక విద్యుత్ కోతలకు దిగుతూ..
పెరుగుతున్న డిమాండ్
శివార్లలో ఇప్పటికే గంటపాటు అమలు
త్వరలో అధికారిక ‘కోత’లు!
సిటీబ్యూరో: వేసవి ఛాయలు పూర్తిగా కనిపించడమే లేదు... కానీ విద్యుత్ శాఖ జనానికి చెమటలు పట్టిస్తోంది. అనధికారిక విద్యుత్ కోతలకు దిగుతూ.. మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది.దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డిమాండ్.. సరఫరాకు మధ్య సుమారు రెండు మిలియన్ యూనిట్ల తేడా ఉంటోందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చెబుతున్నారు. శివారుల్లో రోజుకు గంట పాటు కోత విధిస్తున్నారు. మరోవైపు లైన్ల పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే సర్కిళ్ల వారీగా అన ధికారిక కోతలు అమలు చేస్తున్న డిస్కం.. మరో పది రోజుల తర్వాత రోజుకు నాలుగు గంటల పాటు విడతల వారీగా అధికారిక కోతలు అమలు చేయాలని యోచిస్తోంది.
ఏసీల దెబ్బతో...
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 52 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఒక్క గ్రేటర్‌లోనే 38 లక్షలు ఉన్నాయి. డిస్కం పరిధిలో ప్రస్తుతం 5,300 మెగవాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. దీనిలో 35 శాతం వ్యవసాయం, 40 శాతం పరిశ్రమలు, 25 శాతం గృహాలు వినియోగిస్తున్నాయి. గత వారం రోజుల గణాంకాలు పరిశీలిస్తే విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా కొత్తగా ఐదు శాతం కనెక్షన్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ధనవంతుల నివాస్లాలో మాత్రమే కనిపించే ఏసీలు, కూలర్లు నేడు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. దీంతో వినియోగం ఆ స్థాయిలోనే పెరుగుతోంది. దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కోతలు అనివార్యమవుతున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా భారీగా ఉంటోంది. పంటలను కాపాడే క్రమంలో గృహ విద్యుత్‌కు కోత పడుతోంది.
నిరంతర సరఫరాకు సన్నాహాలు
గతంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తి, సరఫరా తగ్గినప్పటికీ ఇప్పటి వరకూ కోత విధించలేదు. వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు నగరంలో లైన్ల పున రుద్ధరణ పనులు చేస్తున్నారు. దీంతో అక్కడక్కడ అనివార్యంగా సరఫరా నిలిపివేయాల్సి వస్తోంది. రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్