ధర్మాసనం ముందు ప్రత్యూష ఏం మాట్లాడింది?
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేష్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే తన ఛాంబర్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి ప్రత్యూషతో మాట్లాడింది. ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ధర్మాసనం తమ ఛాంబర్‌లో రహస్య విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌ను మాత్రమే విచారణకు అనుమతించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సవతి తల్లి, తండ్రి చేతుల్లో తను ఏ విధంగా చిత్రహింసలకు గురైందీ ఆమె కోర్టుకు వివరించింది.
సవతి తల్లి, తండ్రికి శిక్ష పడాలని కోరుకుంటున్నానని ఆమె గట్టిగా చెప్పింది. ఈ విషయాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని, చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ధర్మాసనం ఆమెకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తదుపరి ఏం చేయాలన్న విషయంపై కూడా ధర్మాసనం ఆరా తీసింది. నర్సింగ్ కోర్స్ పూర్తి సేవ చేస్తానని ప్రత్యూష చెప్పింది. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆందోళన చెందొద్దని, ముందు ఇంటర్ పూర్తి చేసి, ఆ తరువాత ఇష్టమైన నర్సింగ్ కోర్సును పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని ధర్మాసనం ఆకాంక్షించింది.
ప్రత్యూషను హింసించిన వ్యవహారంలో ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె తండ్రి రమేష్‌కు వస్తున్న జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యూషకు అందేలా చూడాలని స్పెషల్ జీపీ శరత్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆమె పేరుపై ఉన్న డబుల్ బెడ్‌రూం ద్వారా వచ్చే అద్దె మొత్తాన్ని కూడా ఆమెకు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో ఆమె పేరు మీద ఓ బ్యాంకు ఖాతాను తెరచి, ఆ మొత్తాలు అందులో జమయ్యేలా చూడాలంది.
సీఎం కేసీఆర్ కు అభినందన
ప్రత్యూష విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించిన తీరును ధర్మాసనం అభినందించింది. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండి కూడా కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లి మరీ ప్రత్యూషను పరామర్శించి, భవిష్యత్తు గురించి ఆమెకు భరోసా ఇచ్చిన తీరును ఎంతో గొప్పగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా చేయడం ద్వారా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటున్న యువతులకే కాక మొత్తం ప్రజలకు సమస్య వస్తే తాను ఉన్నానన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించింది.
ఈ ఘటన ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంచి మానవతావాదన్న విషయం రుజువైందని కూడా ధర్మాసనం చెప్పినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళతారని తాము అసలు ఊహించలేదంది. ఏదేమైనా అంతిమంగా ప్రత్యూషకు మంచి జరగాలనే అందరూ ఆశించారని, అదే ఇప్పుడు జరుగుతోన్నందుకు తమకు ఆనందంగా ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది.