చిరాయువు చిక్కేనా!
దీర్ఘాయువు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు
- సరికొత్త సాంకేతికతలతో ముందుకొస్తున్న పరిశోధకులు
- మందులు, అవయవాల మార్పిడి వంటి పద్ధతులతో సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు
ఆయురారోగ్యాలతో వందేళ్ల పాటు జీవించాలని కోరుకోని వారుంటారా.. వయసును జయించేందుకు ఎన్నో ఏళ్లుగా మానవుడు చేయని ప్రయత్నం లేదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. మరణాన్ని జయించడం, వయసుతో పాటు వచ్చే అనేక సమస్యలను అధిగమించడం వంటి లక్ష్యాలతో సాగుతున్న పరిశోధనల తీరు తెన్నులివిగో.. - సాక్షి, హైదరాబాద్
మందులతో వయసుకు చెక్
మధుమేహ నియంత్రణకు మెట్‌ఫార్మిన్ మాత్రలు వేసుకునే వారి ఆయువు కొంత పెరుగుతుందట. ఇది వార్ధక్య లక్షణాలను తగ్గిస్తూ జీవితకాలాన్ని కనీసం 50 శాతం మేర పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే సూక్ష్మజీవులపై చేసిన ఈ పరిశోధనలు మానవులపై ఎంతమేర పనిచేస్తుందో ప్రశ్నార్థకమే. జీవితకాలంపై మెట్‌ఫార్మిన్ చూపే ప్రభావాన్ని కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ సమస్యను అధిగమించగలిగితే దీర్ఘాయువుకు దోహదపడుతుందని అంచ నా. ‘గెరో’ వంటి ఫార్మా కంపెనీలు మెట్‌ఫార్మిన్‌తోపాటు రాపమైసిన్, కార్నోసైన్ వంటి రసాయనాలతో శరీర కణజాలాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సఫలీకృతమైతే మానవుడు సులువుగా 110 నుంచి 120 ఏళ్లు బతికేయవచ్చునని అంచనా.
అవయవాల ఎక్స్చేంజ్...
వయసు పెరిగే కొద్ది శరీరంలోని అవయవాలు బలహీనపడటం, పనిచేయకపోవడం జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు ఈ అవయవాలను మార్చుకోగలిగితే ఎక్కువ కాలం బతకొచ్చు. అమెరికాలోని వేక్ ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీజెనరేటివ్ మెడిసిన్ ఇప్పుడు ఇదే పనిలో ఉంది. మూల కణాల ద్వారా పరిశోధనశాలలో అవయవాలను తయారు చేస్తోం ది. ఇంక్‌జెట్ ప్రింటర్ వంటి పరికరంతో ఈ సంస్థ ఇప్పటికే మూత్రాశయాన్ని తయారు చేసి ఓ రోగికి విజయవంతంగా అమర్చింది. టెక్నాలజీ మరింత అభివృద్ది చెందితే సమీప భవిష్యత్తులోనే శరీరం మొత్తాన్ని క్లోనింగ్ చేసి అందులో మెదడులోని సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవచ్చు. అంటే ఒక శరీరాన్ని వదిలి మరోదాంట్లోకి వెళ్లిపోవచ్చన్న మాట.
నానో రోబోలతో..
పాడైన అవయవాల స్థానంలో కొత్త వాటిని అమర్చడం ఓ మార్గమైతే.. ఉన్నవాటిని ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకోవడం ఇంకో పద్ధతి. అమెరికాలోని సెంటర్ ఫర్ నానోటెక్నాలజీ ఇన్ సొసైటీ రెండో పద్దతిపై దృష్టి సారించింది. అతి సూక్ష్మమైన రోబోల సాయంతో శరీర అవయవాలను మరమ్మతు చేసుకోవచ్చని ఈ సంస్థ చెబుతోంది. అంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు, అనవసర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ రోబోలు పనికొస్తాయన్న మాట.
మనిషినే కొత్తగా తయారు చేస్తే..
శరీరంలోని చాలా అంశాలు జన్యు క్రమంపై ఆధారపడి ఉంటాయని తెలిసిన విషయమే. దీంతో వయసుతో పాటు సమస్యలను అధిగమించేందుకు, దీర్ఘాయువు సాధించేందుకు జన్యుక్రమాన్ని ఆసరాగా చేసుకోవాలని కొన్ని పరిశోధక సంస్థలు ఆలోచిస్తున్నాయి. జన్యు క్రమ నమోదులో కీలక పాత్ర పోషించిన క్రెయిగ్ వెంటర్ వంటి శాస్త్రవేత్తలు ఇప్పటికే కృత్రిమ పద్ధతుల్లో కణాలు, కొన్ని సూక్ష్మజీవులను సృష్టించిన విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న జన్యుక్రమ సమాచారం ఆధారంగా పరిశోధన శాలలోనే మానవ కణాన్ని అభివృద్ది చేయాలని జార్జ్ చర్చ్ వంటి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆరోగ్యంతో పాటు, మంచి రూపురేఖలున్న పిల్లల అభివృద్ధికి దారితీస్తుందని అంచనా.