చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: ప్రొ.కె.నాగేశ్వర్
రాష్ట్ర విభజనపై భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలు అనుసరించిన వైఖరిపై మల్కాజ్గిరి స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ప్రతి జిల్లాను హైదరాబాద్లా మారుస్తానంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ... ఆయన సీఎంగా ఉండగా ఎందుకు మార్చలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు చేతగాని తనమా లేక ప్రజలపై ఉన్న కోపమా చెప్పాలని చంద్రబాబును నాగేశ్వర్ డిమాండ్ చేశారు. తమ ఆస్తుల కోసమే హైదరాబాద్ను అభివృద్ది చేశారా లేక మరే కారణం ఏదైనా ఉందో చెప్పాలని అన్నారు. చేతిలో చక్రం ఉన్నప్పుడు బాబు ఒక్క జిల్లానైనా హైదరాబాద్లా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబును ఎలా నమ్మెది అని ఆయన అన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రకు బీజేపీ ప్యాకేజీలు అడగలేదని, చంద్రబాబు కూడా అందుకు ఒత్తిడి చేయలేదని నాగేశ్వర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్యాకేజీలనే అడగని చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ సీమాంధ్రకు 15 ఏళ్ల ప్రత్యేక ప్యాకేజీ అంటున్న బీజేపీ.. లోక్సభలో ఆ అంశాన్ని ఎందుకు చర్చించలేదని ఆ పార్టీని నాగేశ్వర్ సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ కోసం లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ అంతగా పట్టుపట్టలేదని ఆయన గుర్తు చేశారు. అదే అంశంపై రాజ్యసభలో ప్రస్తావించినా ప్రయోజనం ఉండదని తెలిసీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం ప్యాకేజీపై ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా ఉండేందుకు ఆరాటపడ్డారంటూ ఎద్దేవా చేశారు. విభజనపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్లోనే సవరణలకు పట్టుబట్టేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో ప్యాకేజీలను బీజేపీ కోరితే యూపీఏ సర్కారు తప్పకుండా అంగీకరించి ఉండేదని కె.నాగేశ్వర్ అన్నారు.