ఉన్నత విద్యామండలికి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా పోస్టుల భర్తీకి‘స్క్రీనింగ్ టెస్టు’ పెట్టాలని వర్సిటీల ఉపకులపతులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించారు. బుధవారం విజయవాడలో వీసీల సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్లు పి.విజయప్రకాశ్, పి.నరసింహారావు, కమిషనర్ బి.ఉదయలక్ష్మి, మండలి కార్యదర్శి వరదరాజన్, 15 యూనివర్సిటీల వీసీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి స్కైప్ ద్వారా వీడియోలో మాట్లాడారు.
వర్సిటీల్లో 1,104 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర స్థాయిలో కామన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని,పరీక్ష బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించాలని మొదట భావించారు. దీనిపై వీసీలు, విద్యానిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో తాజా సమావేశంలో దీనిపై చర్చించారు. ఉన్నత విద్యామండలి ఇప్పటికే పలు కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నందున అదే మాదిరి ఒక కన్వీనర్‌ను నియమించి ఈ ‘స్క్రీనింగ్ టెస్టు’ బాధ్యత అప్పగించాలని పలువురు వీసీలు సూచించారు.