వానొస్తే.. గుండె చెరువే! | Public demand | Sakshi
Sakshi News home page

వానొస్తే.. గుండె చెరువే!

Published Wed, Jan 20 2016 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

వానొస్తే.. గుండె చెరువే!

వానొస్తే.. గుండె చెరువే!

పబ్లిక్ డిమాండ్
చెన్నై వరదలు ఇటీవల జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. మరి ఇప్పుడు అదే ముప్పు గ్రేటర్ నగరికి పొంచి ఉంది. ఇప్పటికే నగరంలో చిన్న పాటి వర్షం పడినా ఎన్నో కాలనీలు మునిగిపోతున్నాయి. అదే మరి కుంభవృష్టి వర్షం కురిస్తే..?  పరిస్థితేమిటి..
అసలు చెన్నై జలవిలయానికి కారణం.. గత 50 ఏళ్లలో అక్కడ దాదాపు 300 చెరువులు, జలాశయాలు కబ్జాకు గురై కనుమరుగరైపోవడమేనని నిపుణులు నిర్ధరించారు. ఇదే తంతు హైదరాబాద్‌లోనూ కొనసాగుతోంది. ఒకప్పుడు నగరం, దాని చుట్టు పక్కల 500లకు పైగా చిన్నా పెద్ద చెరువులుండేవి. గొలుసుకట్టుగా ఒకటి నిండగానే మరొక దాంట్లోకి నీరు వెళ్లేది. కానీ గత 20 ఏళ్లలో గ్రేటర్‌లోని చాలా చెరువులు, జలశయాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.

ముఖ్యంగా 1995 నుంచి 2004 వరకూ ఆక్రమణలు పెద్ద ఎత్తున సాగాయి. సిటీలో ఇప్పటికి 104 చెరువులు అదృశ్యమయ్యాయని హెచ్‌ఎండీఏ సర్వేలో తేలింది. 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణమున్న చెరువులు కేవలం 169 మాత్రమే మిగిలాయని ఇందులో వెల్లడైంది. ఈ పరిస్థితి భాగ్యనగరిని కలవరపెడుతోంది. ఈ ఆక్రమణల పర్వం ఎన్నాళ్లు..! గ్రేటర్‌లో చెరువుల్ని పరిరక్షించి.. కబ్జాదారుల భరతం పట్టే నాయకులకే ఓటేస్తామంటున్నారు నగరవాసులు. - సాక్షి, సిటీబ్యూరో, కుత్బుల్లాపూర్
 
 చినుకు పడితే వణుకే..
 నగరంలో చిన్న పాటి వర్షం కురిసినా బస్తీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఒకప్పుడు జలదుర్గం, వనదుర్గమని కీర్తి గడించిన భాగ్యనగరం భూబకాసురుల వల్ల అస్తిత్వాన్ని కోల్పోతోంది. చెరువులు, నాలాలు కబ్జాలకు గురవడంతో వరద నీరంతా నగరాన్ని ముంచెత్తుతోంది.

‘సాగర్’ సగం మాయం..
కబ్జా దెబ్బకు హుస్సేన్‌సాగర్ సహజ స్వరూపం కోల్పోయింది. సుమారు 240 చ.కి.మీ పరిధిలోని సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండితే ఆ నీరు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. కానీ వీటిలో చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వరద నీరు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చేరుతోంది.

ప్రముఖులే కబ్జారాయుళ్లు..!
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల  జంట జలాశయాల శిఖాన్ని కొందరు రాజకీయ ప్రముఖులు ఆక్రమించి రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. జీవో 111 ప్రకారం వీటి పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఇప్పుడు 80 ఎకరాలకు కుంచించుకుపోయింది. దీని పరిధి మాదాపూర్ పోలీసు స్టేషన్ వరకు ఉండేది. ఇక్కడ బఫర్ జోన్ మాయం చేయడంతో ఆక్రమణలకు అడ్డు లేకుండా పోయింది. ఇక్కడ భారీ భవంతులు నిర్మించిన వారంతా ప్రముఖులే. రాజకీయ ప్రముఖుల అండదండలతోనే రియల్టర్లు రెచ్చిపోతున్నారు. నాయకులకు ముడుపులు అందుతుడడంతో ఆక్రమణలకు వంతపడుతున్నారు. దీంతో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి.
 
ఈ చెరువులేవీ..?
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోని చెరువుల లెక్క తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించగా 73 చెరువులు భౌతికంగా లేవని తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో బతుకమ్మ కుంట(నల్లకుంట), యూసుఫ్‌గూడ(కృష్ణకాంత్ పార్కు), ఆసీఫ్‌నగర్, అఫ్జల్‌గంజ్ చెరువులు సహా మొత్తం 8 చెరువులు మాయమైనట్లు ఈ సర్వేలో తేలింది. రంగారెడ్డి సరూర్‌నగర్ మండలంలోని కనకయ్య కుంట, జాల్ల కుంట, కుత్బుల్లాపూర్ మండలంలోని మొగుళ్ల కుంట, సర్కారీ శిఖం చెరువు, ఇబ్రహీంపట్నం మండలంలోని రెడ్డికుంట, మేలం కుంట, మొయినాబాద్ మండలంలోని కుంట కింది చలక, గొల్లబావి కుంట సహా 40 చెరువులు కనుమరుగయ్యాయి.

ఇక నల్గొండలో సుమారు 20 చెరువుల ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు చెరువు, దేవుని చెరువు, పోచంపల్లి మండలంలోని కొత్తకుంట, ఊరకుంట శిఖం, వందమాని చెరువు, భువనగిరి మండలంలోని కొంగల కుంట గల్లంతైన జాబితాలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ కొత్తూరు మండలంలోని తాళ్లకుంట, కౌలుబావికుంట, మల్లెవాని, చెక్కలవాని కుంటలు, చెలివెందులగూడ చెరువులు అదృశ్యమయ్యాయి.
 
నగరంలో కబ్జాకు గురైన చెరువులు..

హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో..
కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువు 
ఎల్లమ్మ చెరువు
కుత్బుల్లాపూర్ కుంట
పంతులు చెరువు
రంగధాముని చెరువు

శేరిలింగంపల్లి పరిధిలో.. 
గంగారం పెద్దచెరువు
మదీనాగూడ 
బచ్చుకుంట
మల్లయ్య కుంట
మియాపూర్ పటేల్ చెరువు
గోపన్‌పల్లి నల్లకుంట
 
బాలానగర్ పరిధిలో...
 సున్నం చెరువు
కాజాకుంట
ఈదుల కుంట
భీముని కుంట
అలీ తలాబ్ చెరువు
నల్లచెరువు
 
బాలానగర్ పరిధిలో...
సున్నం చెరువు
కాజాకుంట
ఈదుల కుంట
భీముని కుంట
అలీ తలాబ్ చెరువు
నల్లచెరువు
 
చట్టం తీసుకురావాలి..
కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను స్వాధీనం చేసుకునే విధంగా చట్టం రూపొందించాలి. నగరంలోని చెరువులు, కుంటలను గుర్తించి మిషన్ కాకతీయ పనులు చేపట్టి అభివృద్ధి చేయాలి. ఇప్పటికే చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయి. కబ్జాలపై పాలకవర్గం కఠినంగా వ్యవహరించాలి. అలాంటి వారికే నా మద్దతు.
 - విజయ భాస్కర్, బీటెక్ విద్యార్థి, సూరారం
 
 ఆగస్టు 2000.. హైదరాబాద్ నగరం..
 24 గంటల్లో 24 సెంటీ మీటర్ల వర్షం..  
 హుస్సేన్‌సాగర్ నిండిపోయింది.
 సగం సిటీ నీటిలో చిక్కుకుంది.
 
 ఈ రెండూ జలప్రళయాలకు ప్రకృతి ప్రకోపం ఒక్కటే కారణమా..?
 కాదు.. మానవ తప్పిదమే అసలు కారణం
 జలాశయాలు, చెరువులు, నాలాలు కబ్జాకు గురవడంతో నీరు వెళ్లే దారి లేక సంభవించిన జలవిలయాలివి..
 అవును.. ఇది పర్యావరణ వేత్తలు, నిపుణులు నిర్ధరించిన నిఖార్సైన నిజం..
 మరి చెన్నై కుంభవృష్టి మహానగరిలో కురిస్తే పరిస్థితేంటి..?
 
 డిసెంబర్ 2015.. చెన్నై నగరం

 వారం రోజులు ఎడతెరిపి లేని వర్షం..
 స్తంభించిన రవాణా..
 చెరువైన చెన్నై..
 
 ఫెన్సింగ్ వేయాలి..
 పార్కుల చుట్టు ప్రహరీలు నిర్మించినట్టే చెరువులు కబ్జాలకు గురి కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. అప్పుడే కబ్జాలకు అడ్డుకట్ట వేయొచ్చు. వరద నీరు చెరువులు, కుంటల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలి. ఈ దిశగా చర్యలు తీసుకునే వారికే పట్టం కడతాం.
 - టీవీ రెడ్డి, సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల సెక్రటరీ, మైసమ్మగూడ
 
 రూ.50వేలు మించితే
 పత్రాలు ఉండాల్సిదే: సీవీ ఆనంద్
నగరంలో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సూచించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నగదు అక్రమ తరలింపుపై నిఘా వేశామన్నారు. రూ.50 వేలకు మించి ఉన్న నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోతే ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
 - సాక్షి, సిటీబ్యూరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement