మండలిలో ప్రశ్నోత్తరాలు
ప్రభుత్వ పరిశీలనలో బ్రాహ్మణ కార్పొరేషన్
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. పేదరికంలో ఉన్న ఈ వర్గాల వారికి ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కల్యాణలక్ష్మి వంటి అంశాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని చెప్పారు. అర్చకులు, ఇతర ఆలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అందువల్ల ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు చెల్లించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఆదివారం మండలిలో ఈ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
రెండేళ్లలో పోలీస్ కమాండ్ నిర్మాణాలు: నాయిని
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కేంద్రాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ భవన సముదాయంలో ఏ-24, బీ-18, సీ-3, డీ-2 అంతస్తులు ఉంటాయన్నారు. పది జిల్లాలతో సమన్వయపరిచి, ఎక్కడేమి జరిగినా ఈ కేంద్రానికి వెంటనే సమాచారం అందేలా చేస్తామన్నారు. పోలీస్‌శాఖలో వివిధ పోస్టుల్లోని 10,269 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చామని, ఈ ఏడాది చివర్లోగా అవి పూర్తవుతాయని చెప్పారు. సభ్యులు బివెంకటేశ్వర్లు, యాదవరెడ్డి వేసిన ప్రశ్నలపై మంత్రి స్పందించారు.
మైనారిటీ సబ్‌ప్లాన్‌పై ఆలోచన: మహమూద్ అలీ
మైనారిటీలకు కూడా సబ్‌ప్లాన్ తీసుకొచ్చే అంశంపై ఆలోచనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడైతే ఈ ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ బడ్జెట్‌లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన రూ.600 కోట్లకు మరో రూ.800 కోట్లు కలిపి వచ్చే ఏడాది నుంచి మైనారిటీ గురుకులాలకు ఖర్చు చేయబోతున్నట్లు వివరించారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,100 కోట్లలో రూ.466 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిపోయిన మొత్తాన్ని వచ్చే ఏడాది ఇస్తారా అని విపక్ష నేత షబ్బీర్ వేసిన ప్రశ్నపై ఆయన స్పందించారు.