ఎడతెగని నిరీక్షణ | Railway Budget proposals | Sakshi
Sakshi News home page

ఎడతెగని నిరీక్షణ

Published Wed, Feb 25 2015 12:59 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

ఎడతెగని నిరీక్షణ - Sakshi

ఎడతెగని నిరీక్షణ

ఆశల పల్లకిలో రైల్వే బడ్జెట్ హా పడకేస్తున్న ప్రతిపాదనలు
 ముందుకు కదలని ప్రాజెక్టులు హా ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో సదుపాయాలు శూన్యం
ప్రధాన స్టేషన్‌లలోనూ అరకొర సౌకర్యాలే...
 

దక్షిణమధ్య రైల్వేకు కేంద్రబింధువు..ఏటా రూ.2 వేల కోట్ల ఆదాయం. లక్షలాది మంది ప్రయాణికులు, వందలకొద్దీ రైళ్లు. ఉత్తర,దక్షిణ రాష్ట్రాలకు హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి రైల్వేబడ్జెట్‌లో ఏటా నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలోనే ముఖ్యమైన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కలిగి ఉన్నా నిధుల భాగ్యం కలగడం లేదు. దీంతో ప్రతిపాదించిన ప్రాజెక్టులు అటకెక్కుతున్నాయి. దీంతో ప్రతిరోజూ సంస్థకు రూ.1.38 కోట్ల  ఆదాయాన్ని తెచ్చిపెట్టే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సహా నగరంలోని  26 ఎంఎంటీఎస్ స్టేషన్‌లు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రతి రోజు  220కి పైగా  ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి  2లక్షల  మందికి పైగా  రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇక్కడ ఒకటోనెంబర్, పదోనెంబర్  ప్లాట్‌ఫామ్‌లు  మినహా ఎక్కడా కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో ఒత్తిడి తగ్గించేందుకు  వట్టినాగులపల్లి, మౌలాలి ప్రాంతాల్లో  భారీ టర్మినళ్లు నిర్మించాలని గత మధ్యంతర బడ్జెట్‌లో  చేసిన ప్రతిపాదనలు  ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. రాష్ర్ట విభజన తర్వాత చేసిన తొలి ప్రతిపాదనైనా, ఇప్పటి వరకు టర్మినళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అంగుళం భూమి కూడా కేటాయించకపోవడం గమనార్హం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా  సికింద్రాబాద్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా  అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను పట్టించుకునేవారే కరువయ్యారు. గత బడ్జెట్‌లో చేసిన నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ప్రతిపాదన వెనక్కువెళ్లింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఎయిర్‌పోర్టు, బ్రాహ్మణపల్లి కనెక్టివిటీపై ఏడాది కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దాదాపు రూ.850 కోట్ల  విలువైన  ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇప్పటి వరకు కేవలం రూ.150 కోట్లు కేటాయించడంతో పనులు నత్తనడక సాగుతున్నాయి.  ఈ పరిస్థితుల్లో  కేంద్రం రైల్వేబడ్జెట్‌ను  ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది. ఈ బడ్జెట్‌లోనైనా   నగర వాసుల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందా, ప్రయాణికుల సమస్యలు పరిష్కారమవుతాయా....మరోసారి నిరాశే మిగులుతుందా... వేచి చూడాల్సిందే...             - సాక్షి, నెట్‌వర్క్
 
సమస్యల నిలయాలు...                     
 
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో  23 సాధారణ టికెట్ కౌంటర్లు ఉండగా 7 మాత్రమే పని చేస్తుండడంతో  ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. రిజర్వేషన్ కేంద్రంలో  32 కౌంటర్లు ఉండగా, సిబ్బంది కొరత కారణంగా 10 కౌంటర్లు ఎప్పుడు మూసే ఉంటాయి. పైగా సీనియర్ సిటిజన్‌లు, మహిళా  కౌంటర్లు మినహాయిస్తే  5 కౌంటర్లు మాత్రమే సాధారణ ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయి. ఒకటి,పదో నెంబర్ ఫ్లాట్‌ఫాంలపై తప్ప తప్ప మరెక్కడా విచారణ కేంద్రాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్  రైల్వేస్టేషన్‌లో కేవలం 2 చోట్ల మాత్రమే  మూత్రశాలలు ఉండడంతో ప్రయాణీకుల అవస్థలు చెప్పనలవికావు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. అంబులెన్స్ కూడా  ఉండదు. ఫస్ట్‌ఎయిడ్‌సెంటర్ పేరుతో ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీద బోర్డు మినహా వైద్యసదుపాయాలు లేవు. దీంతో ఇటీవల స్టేషన్‌లో గుండెపోటుకు గురైన గుంటూరు వాసి ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ప్లాట్ ఫామ్‌మీద ప్రసవ వేదనకు గురైన ఒక మహిళ అక్కడే మృతి చెందడం అధికారులు నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి.వృద్ధులు, బాలింతలు, వికలాంగులను ప్లాట్‌ఫామ్‌లు దాటించేందుకు ఏర్పాటు చేసిన వీల్‌ఛైర్‌కార్లు అలంకారప్రాయంగామారాయి. మల్కాజిగిరి స్టేషన్‌లో ప్రస్తుతం  3 ప్లాట్‌ఫామ్‌లు ఉండగా, మరో 3 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసిన స్థలం ఉంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు, అదనపు ట్రాక్‌ల నిర్మాణం చేపడితే నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లను  ఇక్కడ నిలిపేందుకు అవకాశం ఉంటుంది.

 హైటెక్‌సిటీలోని ఎంఎంటీఎస్ స్టేషన్ ను అభివృద్ధి చేయడం వల్ల ముంబయి మీదుగా  వచ్చే రైళ్లను  అక్కడ నిలిపేందుకు మార్గం ఏర్పడతుంది. సనత్‌నగర్ రైల్వేస్టేషన్‌లో కనీస వసతుల కల్పనకు ఏళ్ల తరబడి మోక్షం లభించడం లేదు. దూర ప్రాంత రైళ్ల సర్వీసులకు ఇక్కడ ‘స్టాపింగ్’ ఉన్నా మౌలిక వసతుల కల్పన మృగ్యంగా మారింది. మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీప ప్రాంతాల్లో విచ్చలవిడిగా జూదం.. తరచూ తాగుబోతుల వీరంగం నిత్యకృత్యం. ఫ్లైఓవర్లు లేక పట్టాలపై నడుస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.  తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
 
పరిశుభ్రత కరువు...
 
పాతబస్తీ పరిధిలోని రైల్వే స్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబీర్‌పురా స్టేషన్లలో పారిశుద్ధ్యం కొరవడింది. ప్రయాణికులు కూర్చొనేందుకు బెంచీలు లేవు. టిక్కెట్ కౌంటర్లు లేవు.
 సిటీ బస్సు  సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్ల  ఫలక్‌నుమా, యాకుత్‌పురా, డబీర్‌పురా రైల్వేస్టేషన్ల  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని  26 ఎంఎంటీఎస్  రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలపై సమాచారం అందించేవారు లేకపోవడంతో  రైళ్లు ఎప్పుడొస్తాయో,ఎప్పుడు వెళతాయో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.  
 
 కొనసా...గుతున్న వంతెనలు...
 
 నగరంలో 13 చోట్ల  రైల్వే వంతెనలకు గతంలో ప్రతిపాదనలు సిద్దం చేశారు. లక్డికాఫూల్, ఆలుగడ్డ బావి వంటి కొన్ని ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు మినహా చాలా చోట్ల పెండింగ్‌లోనే ఉన్నాయి.  
 ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా కందికల్ గేట్, ఉప్పుగూడ రైల్వే గేట్ల వద్ద ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు 2007లోనే శంకుస్థాపనలు చేసినా పనులు నత్తనడక కొనసాగుతున్నాయి.నిత్యం రద్దీగా ఉండే ఆదర్శ రైల్వేస్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఎస్కలేటర్లు, లిఫ్టులు, అదనంగా మరో  ఆర్‌ఓబీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఏళ్లు గడిచినా ఆచరణ కు  నోచుకోవడం లేదు. ఇక్కడ ఫ్లాట్‌ఫాం నెంబర్ 1లో అండ్ యూజ్ టాయిలెట్‌లు నిర్మించినా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేషన్‌లో నీటి సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు బోరు నీటిని తాగాల్సి వస్తోంది.  చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు సదుపాయం లేకపోవడంతో మరుగుదొడ్లను వాడడం లేదు.

స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్న చందానగర్, పాపిరెడ్డి కాలనీ వాసులు పట్టాలను దాటుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
 హైటెక్‌సిటీ స్టేషన్‌లో ఒకే టికెట్ కౌంటర్ ఉండడం వల్ల ప్రయాణికులు టికెట్ తీసుకునే లోపు రైలు వచ్చి వెళ్లి పోతున్నాయి.
 
గత ప్రతిపాదనలు - పరిష్కారాలు
 
క్రమసంఖ్య    {పతిపాదన  పురోగతి
 
1)    వట్టినాగులపల్లి, మౌలాలి టర్మినళ్ల ఏర్పాటు    ఇప్పటికీ స్థలం కేటాయించలేదు
 2 )    సికింద్రాబాద్ వరల్డ్‌క్లాస్  స్టేషన్‌గా అభివృద్ధి               ప్రతిపాదనకే పరిమితం
 3)    లాలాపేట్ ఆసుపత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా           అమలు కాలేదు
 4)    రైల్వే నర్సింగ్ కళాశాల                                        అమలు కాలేదు.
 5)    గుంటూరు,తిరుపతికి డబుల్ డెక్కర్ రైళ్లు                   వచ్చాయి
  6)    సికింద్రాబాద్-హజ్రత్‌నిజాముద్దీన్ ఏసీ ప్రీమియం        ప్రారంభం కాలేదు.
 7)    హైదరాబాద్- గుల్బర్గా ఇంటర్ సిటీ                        ప్రారంభం కాలేదు.
 8)    ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు          అమల్లోకి రాలేదు
 9)    ఎంఎంటీఎస్ రెండో దశ                                     ప్రారంభించినా ఎయిర్‌పోర్టు
         మార్గంపై ప్రతిష్టంభన
 10 )    సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైలు మార్గం (113కి.మీ.)    పెండింగ్
 11)    మనోహరాబాద్-కొత్తపల్లి  (150 కి.మీ.)మార్గం           పెండింగ్
 
రెండో దశ పనులను వేగవంతం చేయాలి
 

ఎంఎంటిఎస్ రెండోదశ పనులను వేగవంత చేయాలి.  రానున్న రైల్వే బడ్జెట్‌లో ఎంఎంటిఎస్ రెండవ దశ పనులకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే హైదరాబాద్‌లో రెండేళ్లలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.  - నూర్
 
సామాన్యుడికి ప్రయోజనం కల్పించాలి
 
రైల్వే బడ్జెట్‌లో సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బడ్జెట్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేలా చూడాలి. సీనియర్ సిటిజన్‌లు, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. - వి. భాగ్యలక్ష్మి
 
పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవడం కష్టంగా ఉంది
 
రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుపతి వెళ్లేందుకు వెయిటింగ్ టికెట్టు తీసుకున్నాను. టికె ట్టు తీసుకున్న రెండు రోజులకు బెర్తు స్టేటస్ తెలుసుకునేందుకు నాంపల్లికి వచ్చాను. అయితే అక్కడ స్క్రీన్ టచ్ మిషన్లు ఉన్నాయి. వీటిలో పీఎన్‌ఆర్ నంబరును నమోదు చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరుకు సెల్‌ఫోన్‌లో 139 ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. దీనికి ఛార్జీ చేస్తున్నారు. రద్దీకి తగ్గట్లుగా పీఓటీ బాక్సులను  ఏర్పాటు చేస్తే బాగుంటుంది.  - మహేష్ ప్రయాణికుడు
 
మరిన్ని రైళ్లు నడపాలి
 
నగరంలో గుజరాతీలు, రాజస్తానీలు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల బికనీర్, రాజ్‌కోట్, అజ్మీర్‌ల వైపు వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. హైదరాబాదు నుంచి ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజూ ఒక రైలు బయలు దేరేలా చూడాలి.
     - కొత్తింటి ప్రవీణ్ కుమార్ (ప్రయాణికుడు)
 
 దొంగతనాలను నివారించాలి

 
రైళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగలు ప్రయాణికుల లగేజీలు, సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్తుండటం చేత ఆయా వస్తువులు పోగొట్టుకున్న బాధితులు బోగీలోని తోటి ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. స్లీపర్ కోచ్‌ల్లోకి మార్గమధ్యలో ఇతరులను ఎక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.                         - మహేందర్ ప్రయాణికుడు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement