
వానొస్తే.. మునకే!
గ్రేటర్‌లో భారీగా పెరిగిన వాటర్ లాగింగ్స్
ఏటా ఇదే సీన్..
పట్టించుకోని జీహెచ్‌ఎంసీ
ఖర్చు కోట్లల్లో.. పరిష్కారం శూన్యం
ఎవరైనా ఏమైనా సమస్యలు తలెత్తితే దశలవారీగా పరిష్కరించుకుంటారు. దాంతో ఇబ్బందులు ఒక్కొక్కటీ తీరి తెరిపిన పడతారు. కానీ ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు సమస్యను గుర్తించినా దానిని పరిష్కరించకపోగా.. మరిన్ని సమస్యల్ని దానికి జతచేస్తారు. అందుకు నగరంలో వానొస్తే రోడ్లపై నీళ్లు నిలిచిపోయే ప్రాంతాలే (వాటర్ లాగింగ్ పాయింట్లు) ఉదాహరణ. ఉదాహరణకు గతేడాది నీళ్లు నిలిచిపోతున్న రోడ్లుగా 185 పాయింట్లను గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటికి ఇవి 284కి చేరాయి. అంటే దాదాపు మరో వందకు పెరిగాయి. అధికారులు సమస్య పరిష్కారంలో చూపుతున్న ‘శ్రద్ధ’కు ఇది నిదర్శనం. కానీ వీటి మరమ్మతుల పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రికార్డులు మాత్రం ఘనంగా చూపుతున్నారు.
సిటీబ్యూరో: సాధారణ వర్షాలొచ్చినా నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు పెరుగుతూ పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇందుకు కారణం సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపకపోడం. ప్రతిసారీ వర్షాకాలానికి ముందే పనులు చేస్తామని ప్రకటించడం.. వర్షాలు మొదలయ్యేంతదాకా పనులు పూర్తి చేయకపోవడం.. ఆ పనుల పేరిట నిధులు మాత్రం ఖర్చయిపోవడం పరిపాటిగా మారింది. దీంతో వర్షాలొచ్చిన ప్రతిసారి నగరంలో ఎక్కడికక్కడ చెరువులుగా మారడం.. ట్రాఫిక్ సమస్యలతో జనం సతమతమవడం షరామామూలుగా మారింది. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో పైపై పూతలతో మమ అనిపిస్తుండటంతో ఈ దుస్థితి దాపురించింది. శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ఒక లాగింగ్ పాయింట్ సమస్యను పరిష్కరిస్తే.. అక్కడ నిలువ ఉండే నీరు వేరే ప్రాంతాల్లో చేరి అక్కడ కొత్తగా లాగింగ్ పాయింట్లు వస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీ వద్ద ఏదీ సమాచారం?
ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ అధికారుల వద్ద తగిన ప్రణాళిక లేదా.. ? అంటే లేదనే సమాధానం వస్తుంది. నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలున్నాయి.. ఏ రోడ్డు కింద ఏ గండం పొంచి ఉంది.. ఏ చెరువులు ఎంత మేర కబ్జా అయ్యాయి.. ఎక్కడెన్ని పైప్‌లైన్లున్నాయి.. డ్రైనేజీ లైన్లు ఎక్కడున్నాయి.. ఏ నీరు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుంది.. సివరేజి నీరు ఏయే ప్రాంతాల్లో వరదనీటి కాలువల్లో కలుస్తోంది.. అందుకు కారణాలేమిటి.. ఇత్యాది సమాచారమేదీ జీహెచ్‌ఎంసీ వద్ద లేదు. గ్రేటర్‌లో ఏ రహదారి పరిస్థితి ఏమిటో, ఏ ఫ్లై ఓవర్‌కు పొంచి ఉన్న ప్రమాదమెంతో, ఏ శిథిల భవనం ముప్పు ఎంతో తెలుసుకొని ప్రమాదాల్ని నివారించాలనే ధ్యాస అసలే లేదు. నాలాలు, పైపులైన్లు, రహదారులకు సంబంధించిన డేటేబేస్ అంటూ జీహెచ్‌ఎంసీ వద్ద లేదు.
ఆస్తిపన్ను వసూళ్లు, డస్ట్‌బిన్ల నుంచి చెత్త తొలగింపు, అక్రమ నిర్మాణాల గుర్తింపు వంటి పనులకు ఐటీని వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న జీహెచ్‌ఎంసీ ఏ రోడ్డు పరిస్థితి ఏమిటో చెప్పగలిగే స్థితిలో లేదు. ఎన్ని నాలాలు అన్ కవర్డ్(రోడ్లు, బ్రిడ్జిలకింద)గా ఉన్నాయో అంచనాలు తప్ప సరైన లెక్కల్లేవు. ఏ రోడ్డుకింది నాలా ఏ సంవత్సరంలో నిర్మించారో తెలియదు. వాటి జీవితకాలమెంతో తెలియదు. రహదారులు చెరువులైనప్పుడో, రోడ్లు కుంగినప్పుడో తప్ప నాలాల స్థితిగతుల గురించి కానీ, వాటి మరమ్మతుల గురించి కానీ పట్టించుకోవడం లేరు. ఏ నాలాకు ఎప్పుడు మరమ్మతులు చేశారో కూడా జీహెచ్‌ఎంసీ వద్ద వివరాల్లేవు. ఆ మాటకొస్తే రో రోడ్డు కింద ఎన్ని నాలాలున్నాయో తెలియదు. రోడ్ల కింద దాదాపు ఎన్ని నాలాలు.. ఎంత దూరం మేర ఉన్నాయో ఉజ్జాయింపుగా చెబుతున్నారు తప్ప డేటాబేస్ లేదు. దీంతో, ఏ నాలాలకు ఎప్పుడు వురవ్ముతులవసరమో చెప్పగలిగే వ్యవస్థ లేదు.