
సాక్షి, హైదరాబాద్: చౌక ధరల దుకాణాల డీలర్లకు కమీషన్ పెంచి, పూర్తి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా నిధులను విడుదల చేస్తుందని బీజేపీ తెలిపింది. అయితే వాటిని డీలర్లకు ఇవ్వకుండా పాత ధరల ప్రకారం తక్కువ మొత్తం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని వేధిస్తోందని ఆరోపించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత లక్ష్యంగా క్వింటాల్ ధాన్యానికి కేంద్రం రూ.35 చొప్పున కమీషన్ చెల్లిస్తోందని, అంతే మొత్తాన్ని రాష్ట్రం చెల్లించాల్సి ఉందని, కానీ కేంద్రం పూర్తి నిధులిస్తే పాత ధర రూ.20 ప్రకారమే డీలర్లకు చెల్లిస్తూ మిగతా మొత్తాన్ని మినహాయించు కుంటోందని ఆరోపించింది.
దీంతో సరిపడా ఆదాయంలేక డీలర్లు తీవ్రంగా నష్టపోయి రోడ్డునపడే పరిస్థితి తలెత్తిందన్నారు. వారి బాధలు చెప్పుకోవడానికి ప్రయత్నించినా ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వటం లేదని పేర్కొంది. బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సుధాకరశర్మలతో కలిసి శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిన కేంద్రం వాటా నిధులతోపాటు తన వాటా నిధులను ప్రస్తుత రేట్ల ప్రకారం సమకూర్చి పూర్తి కమీషన్‌ను డీలర్లకు అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్ సగటు మనిషి, రైతు అనుకూలంగా ఉంటే దాన్ని టీఆర్‌ఎస్ మంత్రులు ఎద్దేవా చేయటం వింతగా ఉందన్నారు. రూ.లక్ష వరకు ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత ఇంటికి ఒకరికేనని మాటతప్పిన రాష్ట్రప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేయటం వింతగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment