
గ్రేటర్ కు విద్యుత్ షాక్
పెరగనున్న చార్జీలు
ఏప్రిల్ 1 నుంచి అమలు
వినియోగదారులపై నెలకు రూ.33.75కోట్లు.. ఏటా రూ.405 కోట్ల భారం
పరిశ్రమలు, వాణిజ్య సంస్థలేలక్ష్యంగా పెంపు
200 యూనిట్ల లోపు వాడే గృహాలకు మినహాయింపు
సిటీబ్యూరో/జీడిమెట్ల: విద్యుత్ వినియోగదారులకు ఈఆర్‌సీ మరోసారి షాక్ ఇచ్చింది. చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డిస్కం ప్రతిపాదించిన బిల్లులను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 200 యూనిట్లలోపు వినియోగించే వారిని మాత్రం కొత్త చార్జీల నుంచి మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. సుమారు 28 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఈ పరిథిలోకి రారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మధ్య తరగతి, ఆపై వర్గాల (పది లక్షల మంది వినియోగదారులు) లక్ష్యంగా చార్జీలు పెంచినట్టు స్పష్టమవుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలుఅమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో గ్రేటర్ పై నెలకు రూ.33.75 కోట్ల చొప్పున... ఏడాదికి రూ.405 కోట్ల భారం పడబోతోంది. గ్రేటర్‌లో 200 యూనిట్లకు పైగా వాడుతున్న గృహ విద్యుత్ వినియోగదారులు 4.5 లక్షల మంది ఉండగా... 5.5 లక్షల వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే సర్‌చార్జీల భారంతో సతమతమవుతున్న మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు విద్యుత్ చార్జీల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరింత సంక్షోభంలో పరిశ్రమలు
తెలంగాణలో ప్రస్తుతం పరిశ్రమలు మందకొడిగా నడుస్తున్నాయి. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం. ఈ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. లేదంటే సంస్థలు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
- రామకృష్ణ, ఎక్స్ ఓవెన్ ఇండస్ట్రీస్, జీడిమెట్ల ఐలా చైర్మన్
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లే
ఇప్పటికే ఆర్డర్లు లేక పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడమంటే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లే. పరిశ్రమల కష్టాలను దృష్టిలో
పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకుంటే బాగుంటుంది.
-కృష్ణ, ఈజ్వీడైస్ అండ్ మౌల్డ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల
మధ్య తరగతి ఉద్యోగులపైనే భారం
ఇంటి పన్నులను ఇప్పటికే అమాంతం పెంచేసిన సర్కార్... క రెంట్ బిల్లులను మరోసారి పెంచడం దారుణం. ఈ చార్జీల పెంపు వల్ల మధ్య తరగతి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపైనే కాకుండా సామాన్యులపై భారం పడుతుంది. వేతనాలు పెంచకుండా చార్జీలు పెంచడం దారుణం.
-ఎం.ఎస్.రెడ్డి, శ్రీరమణ కాలనీ