ప్రతిపక్షాలకు ఓటేస్తే మిగిలేది బూడిదే..
రోడ్ షోలో మంత్రి కేటీఆర్
కాచిగూడ: జోగిజోగి రాసుకుంటే బూడిద రాలినట్లే.. కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలను గెలిపిస్తే బూడిదే మిగులుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అంబర్‌పేట నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. అభ్యర్థులు చైతన్య కన్నాయాదవ్(కాచిగూడ), కాలేరు పద్మా వెంకటేష్(గోల్నాక), పులిజగన్(అంబర్‌పేట), పద్మిని డిపిరెడ్డి(బాగ్‌అంబర్‌పేట), గరిగంటి శ్రీదేవి రమేష్(నల్లకుంట)ల తరఫున ఆయా డివిజన్లలో కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటేసి, కేసీఆర్‌తో పనిచేయించుకోవాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు.70 స్మార్ట్ సిటీలు ఎంపిక చేస్తే అందులో తెలంగాణ నుంచి ఒక్కటి కూడా లేకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఐదు పైసల పని కూడా చేయని బీజేపీకి ఓట్లు ఎలా వేస్తారని, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయని టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రశ్నిస్తున్నాయని.. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న వారికి గుర్తుకురాని రోడ్లు, ఇప్పుడు టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే గుర్తొచ్చాయా అన్నారు. 65 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 18 నెలల్లో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, పైలా శేఖర్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, నియోజకవర్గ ఇంచార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, నేతలు ఎక్కాల కన్నా, దుర్గాప్రసాద్‌రెడ్డి, సి.కృష్ణయాదవ్, దిడ్డి రాంబాబు, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.