ఈ కేసులు కొలిక్కి వచ్చేనా? | Robbers target by homes at They VIP | Sakshi
Sakshi News home page

ఈ కేసులు కొలిక్కి వచ్చేనా?

Published Mon, May 2 2016 1:41 AM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

ఈ కేసులు కొలిక్కి వచ్చేనా? - Sakshi

ఈ కేసులు కొలిక్కి వచ్చేనా?

‘ వీఐపీ’ ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు
కేసులు ఛేదించడంలో పోలీసుల విఫలం

 
బంజారాహిల్స్:   ఫిల్మ్‌నగర్ సినార్ వ్యాలీలో రియల్టర్ ఎస్‌ఎస్ శర్మ ఇంట్లో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. కేవలం ఈ కేసులో మాత్రమే కాదు... గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్‌జోన్ పరిధిలో చోటు చేసుకున్న అనేక ‘వీఐపీ’ కేసులూ కొలిక్కి రాకుండానే ఉన్నాయి.  ప్రముఖులు నివసించే ఈ జోన్ పరిధిలోనే పరిస్థితులు ఇలా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నగరంలో ఉన్న ప్రముఖుల్లో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ల పరిధిల్లోనే నివసిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో జరిగిన చోరీలను ఛేదించడంలో పోలీసులు విఫలం అవుతున్నారు.

అనేక లోపాలను తమకు అనువుగా మార్చుకుంటున్న దొంగలు పక్కాగా రెక్కీ చేసి మరీ ఎలాంటి ఆధారాలు వదలకుండా ‘పని’ పూర్తి చేసుకెళ్తున్నారు. శర్మ ఇంట్లో జరిగిన పంథాలోనే గడిచిన కొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ పరిధిలో మూడు దొంగతనాలు జరిగాయి. ఈ చోరీలన్నీ ఒకే వ్యక్తి చేశాడని అనుమానించడం మినహా... పోలీసులు సాధించిన పురోగతి అంటూ ఏమీ లేదు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు ఆ తర్వాత దాని విషయం మర్చిపోతుండటం బాధితులకు శాపంగా మారుతోంది. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు కేసుల్ని కొలిక్కి తీసుకురమ్మని చెప్తున్నా  క్షేత్రస్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం, క్షేత్రస్థాయి పోలీసింగ్‌లో పోలీసుల వైఫల్యమో, నానాటికీ తెలివి మీరుతున్న చోరుల విధానమో... ఏదేమైనా బాధితులుగా ఉంటున్న ప్రముఖులకు సైతం నష్టమే మిగులుతోంది.

  ‘ప్రముఖ’ కేసుల్లో కొన్ని...
ఫిల్మ్‌నగర్‌లో సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర్‌రావు నివాసంలో 2009 అక్టోబర్ 14న రెండు కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి.  వీటి విలువ రూ.60 లక్షలు.
ఫిల్మ్‌నగర్‌లో సినీ నటుడు అశోక్ కుమార్ ఇంట్లో 2010 మార్చి నెలలో దొంగలు పడి రూ.25 లక్షలు విలువ చేసే నగలు ఎత్తుకెళ్లారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లో ఎమ్మెల్యే, ఎంపీల కాలనీని ఆనుకొని ఉన్న సీఆర్‌పీఎఫ్ క్వార్టర్స్‌లో దక్షిణ భారత సీఆర్‌పీఎఫ్ ప్రధానాధికారి నివాసంలో నాలుగేళ్ల క్రితం దొంగలు పడ్డారు. దాదాపు రూ.1 కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని మాజీ చీఫ్ సెక్రటరీ హరిహరన్ నివాసంలో 2014 ఏప్రిల్ 11న దొంగలు పడ్డారు. దాదాపు రూ. 4 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లో నివసించే బ్లూ మూన్ హోటల్ మాజీ నిర్వాహకుడు గుండా సుధీర్  ఇంట్లో గతేడాది మార్చి 15న 190 తులాల బంగారం చోరీకి గురైంది.
బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని మిథిలానగర్ సమీపంలో నివసించే మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం  ఇంట్లో గతేడాది రూ.40 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
ఫిల్మ్‌నగర్ వెంచర్-2లో ఎంపీ, నిర్మాత మురళీమోహన్ కుమారుడు నివసిస్తున్నారు. శ్రీలంక నుంచి వచ్చి ఈ ఇంట్లో బస చేసిన సన్నిహితురాలి వజ్రాల హారం గతేడాది చోరీకి గురైంది.
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78లో ఆర్కిటెక్ట్ రవి నివాసంలో ఇటీవల దొంగలు పడి రూ.7 లక్షలు విలువైన ఆభరణాలు తస్కరించారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.12లో  మాజీ మంత్రి వినోద్ ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement