
గాంధీ విగ్రహం వద్ద రోజా మౌనదీక్ష
♦ ఉదయం నుంచి గాంధేయ మార్గంలో నిరసన
♦ రోజాకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం
♦ న్యాయం జరిగేవరకు అండగా ఉంటామన్న పార్టీ అధినేత జగన్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.. తనను రెండోరోజు శనివారం కూడా శాసనసభలోకి అనుమతించకపోవడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఫుట్‌పాత్‌పై మౌనదీక్ష చేపట్టారు. ఎండలో దీక్ష చేపట్టిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను నిమ్స్‌కు తరలించారు. ఉదయం 8.45 గంటలకు నల్ల దుస్తుల్లో వచ్చి అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోజాను గేటు 2 సమీపంలో మార్షల్స్ అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు, మార్షల్స్‌కు వాగ్వాదాం జరిగింది. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, తనను లోపలికి అనుమతించాలని ఆమె కోరారు. అందుకు మార్షల్స్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఆమె తాను ఎందుకు సభలోకి రాకూడదో రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా మార్షల్స్ లోపలికి అనుమతించకపోవడంతో రోజా అక్కడే బైఠాయించారు. నిరసనకు దిగిన ఆమెకు పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, వి.కళావతి, పి.పుష్పశ్రీవాణి, వి.రాజేశ్వరి, గౌరు చరితారెడ్డి మద్దతుగా నిలిచారు.
ఉదయం 9 గంటలకు రోజా అసెంబ్లీ బయట గాంధీజీ విగ్రహం ఎదురుగా ఫుట్‌పాత్‌పై మౌనదీక్ష చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వంపై గాంధేయ మార్గంలో నిరసన తెలిపిన ఆమెకు సంఘీభావంగా మహిళా ఎమ్మెల్యేలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లడంతో రోజా ఒంటరిగానే దీక్ష కొనసాగించారు. అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడిన తర్వాత ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, సర్వేశ్వరరావు, కోన రఘుపతి, కొరుముట్ల శ్రీనివాసులు వచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఆమెకు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత మహిళా ఎమ్మెల్యేలు వచ్చి రోజా వద్ద కూర్చున్నారు. వాళ్లతోపాటు ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, నారాయణస్వామి, జంకె వెంకటరెడ్డి, పి.రాజన్నదొర, ముత్యాలనాయుడు, చిర్ల జగ్గిరెడ్డి, సి.రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, సుజయ్ కృష్ణరంగారావు, ముస్తాఫ, ఐజయ్య కూడా రోజాకు మద్దతుగా అక్కడే కూర్చున్నారు.
పార్టీ నేతలు, కుటుంబసభ్యుల పరామర్శ
బీపీ, సుగర్ లెవెల్స్ పడిపోయి అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోజాను పార్టీ నేతలు, కుటుంబసభ్యులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డ్డి, గిడ్డి ఈశ్వరి, రోజా భర్త సెల్వమణి, కుమారుడు కౌషిక్, కుమార్తె అన్షు ఆమెను పరామర్శించారు. వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు డాక్టర్ గణేశ్ తదితరులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.ఆస్పత్రికి తెచ్చినప్పుడు ఆమెకు బిపీ 150-90, సుగర్ లెవల్స్ 61 ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు చెప్పారు.
బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయి సొమ్మసిల్లిన రోజా
ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం 11.45 గంటలకు రోజా సొమ్మసిల్లిపోయారు. ఆమె అస్వస్థతకు గురవడంతో సహచర శాసనసభ్యులు ఆందోళన చెందారు. ఆమెకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెం బ్లీ ఆవరణలోని 108 వద్ద నుంచి బీపీ టెస్టర్, స్టెతస్కోప్ తెప్పించి రోజాను పరీక్షించారు. అదే సమయంలో రోజాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాసరెడ్డిని అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. రోజాను నిమ్స్‌కు తరలించాలని 108 సిబ్బందిని కోరారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని ఆయన రోజాకు ధైర్యం చెప్పారు.