మిషన్ భగీరథకు రూ. 6,750 కోట్లు
- రుణాలిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు
- ఏడు బ్యాంకుల కన్సార్షియం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి రుణ సాయం అందించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో కన్సార్షియంగా ఏర్పడిన ఏడు బ్యాంకులు దాదాపు రూ. 6,750 కోట్ల రుణం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోగల ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఎండీ, సీఈవో సురేశ్ ఎన్.పటేల్ అధ్యక్షతన బుధవారం జరిగిన కన్సార్షియం సమావేశంలో బ్యాంకులు దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాయి. సమావేశంలో సురేశ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రాజెక్టు కోసం తాము ఇప్పటికే రూ. 1,300 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి ఒప్పుకున్నామన్నారు.
ఇందులో ఇతర బ్యాంకులను భాగస్వాములను చేసే ఉద్దేశంతో కన్సార్షియం ఆలోచనకు రూపకల్పన చేశామన్నారు. ప్రాజెక్టు డీపీఆర్‌లను తమ బ్యాంకు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాతే బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో రుణ సాయంపై నిర్ణయం తీసుకున్నారన్నారు. మిషన్ భగీరథ రుణాలకు రాష్ట్రం గ్యారంటీగా ఉండటం బ్యాంకర్లలో భరోసా పెరిగిందన్నారు. ఇంకొన్ని బ్యాంకులు కన్సార్షియంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయని, వాటి విషయాన్ని తర్వాతి విడతలో ఆలోచిస్తామన్నారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ లక్ష్యాలు, అవసరాలను పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలువబోతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, దేనా, పంజాబ్ అండ్ సింధ్, సిండికేట్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
2019 నుంచి చెల్లింపులు...
మిషన్ భగీరథకు రూ. 1,300 కోట్ల రుణాన్ని ఆంధ్రా బ్యాంకు త్వరలోనే అందించనుండగా మిగతా బ్యాంకులు త్వరలోనే తమ బ్యాంకుల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాల్లో రుణ సాయానికి సాంకేతికంగా ఆమోదం తెలిపాక అందించనున్నాయి. 2019 నుంచి గరిష్టంగా 12 ఏళ్లలో రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రుణ సంస్థలైన నాబార్డు, హడ్కో నిబంధనల ప్రకారం తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చాయి. రుణాలను కరీంనగర్ జిల్లా కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని-భూపాలపల్లి, ఎల్‌ఎండీ, కరీంనగర్, మానకొండూర్‌తోపాటు వరంగల్ జిల్లాలోని గోదావరి-మంగపేట సెగ్మెంట్‌లోని మిషన్ భగీరథ పనులకు ఉపయోగించనున్నారు.
బ్యాంకులవారీగా ప్రాజెక్టుకు
అందనున్న రుణం (రూ.కోట్లలో)
ఆంధ్రా బ్యాంకు 1,300
దేనా బ్యాంకు 500
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు 700
సిండికేట్ బ్యాంకు 1,000
ఓబీసీ 1,000
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 1,000
ఇండియన్ బ్యాంకు 750
అలహాబాద్ బ్యాంకు 500