
టైర్ మారుస్తుండగా...రూ.కోటి నగలు మాయం
వ్యాపారి దృష్టి మరల్చి అపహరణ
హైదరాబాద్: ఓ నగల వ్యాపారి దృష్టి మరల్చి 3.5 కిలోల బంగారు ఆభరణాల బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తం సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లో నివాసం ఉండే అభిషేక్ అగర్వాల్.. యషశ్రీ జువెల్లరీ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వివిధ రకాల మోడళ్లను తయారు చేసి మలబార్ గోల్డ్ షోరూంలకు సరఫరా చేస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం స్కొడా కారులో రూ.కోటి విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని బయలుదేరి.. అమీర్‌పేట, కూకట్‌పల్లి, చందానగర్‌లోని మలబార్ గోల్డ్ షోరూంలలో నమూనాలను చూపించారు.
తిరిగి వస్తుండగా కూకట్‌పల్లిలోని ఏఎస్‌రాజు నగర్ కమాన్ దాటిన తరువాత కారు వెనుక టైర్ పంక్చర్ అయింది. అభిషేక్, అతని వద్ద పనిచేసే ఆశిష్ టైర్‌ను మార్చి వచ్చి చూడగా.. నగల బ్యాగు కనిపించలేదు. దీంతో అభిషేక్ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ టైర్ మారుస్తున్న సమయంలో కారు వద్ద ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. చందానగర్ నుంచి కారు వెంబడి ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు అనుసరించినట్లు నగల వ్యాపారి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది.