సాహితీ ఆంగనం | sahiti anganam | Sakshi
Sakshi News home page

సాహితీ ఆంగనం

Published Wed, Jan 21 2015 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

సాహితీ ఆంగనం

సాహితీ ఆంగనం

హైదరాబాద్.. ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ! చౌమొహల్లా ప్యాలెస్ మొదలు చిక్కడపల్లి త్యాగరాయగానసభ, సైఫాబాద్ రవీంద్రభారతి వయా సికింద్రాబాద్ హరిహరకళాభవన్, అవర్ సేక్రెడ్ స్పేస్ నుంచి బంజారాహిల్స్ గోథే జెంత్రం, కళాకృతి, సృష్టి ఆర్ట్ గ్యాలరీల స్పేస్ పూరిస్తూ, శిల్పకళా వేదికనూ వరించి హైటెక్స్ హంగులనూ అద్దుకొని నిత్యం ఏదో ఒక సంబురం సందడి చేస్తూనే ఉంటుంది.. జాతీయ, అంతర్జాతీయ వేడుకలెన్నో భాగ్యనగరినీ భాగస్వామిని చేస్తుంటాయి ! అలాంటిదే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్! శుక్రవారం నుంచి 26వ తేదీ వరకూ చిన్నాపెద్దా అందరినీ ఆనందంలో ముంచనుంది!  ఈ సాహితీ పండుగ కు ఈ ఏడాది వేదిక.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్!
 ..:: సరస్వతి రమ
 
 2010 నుంచి అక్షరమాలికల అల్లిక ప్రారంభించిందీ హైదరాబాద్ ఫెస్టివల్. సాహిత్యంలోని సృజనాత్మక ప్రక్రియలన్నిటికీ ఒక ముంగిలిగా నిలిచే ఈ ఈవెంట్ పలు భాషల ద్వారాలనూ నిలుపుతోంది. ఏటా ఒక్కో భారతీయ భాష మీద ప్రధాన దృష్టి సారిస్తోంది. అలా హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఉర్దూ భాష ఈ ఏడాది పండుగలో తన విశిష్టతను చాటనుంది. ఈ భాషలో భిన్న సాహితీ ప్రక్రియలను పరిచయం చేయడం, అవసానదశలో ఉన్న సాహితీకళను ప్రదర్శించడంతో పాటు ఉర్దూ ప్రఖ్యాత రచయితలు, కవులు.. వాళ్లు రాసిన రచనల విశ్లేషణ ఉండబోతున్నాయి.
 
దాస్తాన్‌గొయి..
దాస్తాన్, గొయి అనే రెండు పర్షియన్ పదాల కలియికే దాస్తాన్‌గొయి. అంటే కథ చెప్పే కళ. ఉర్దూ సాహిత్యంలో అవసాన దశలో ఉన్న ప్రక్రియ ఇది. మహమూద్ ఫారూఖీ దర్శకత్వం వహించిన 80 నిమిషాల దాస్తాన్ ఇ ఛౌబోలీ అనే దాస్తాన్‌గొయిని ప్రదర్శించనున్నారు రాణా ప్రతాప్, రాజేష్‌కుమార్ అనే కళాకారులు. ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూధియాన్వీ మీద రాసిన ‘పర్‌ఛాయియా’ నాటకాన్ని ప్రముఖ నటుడు టామ్ ఆల్టర్ ప్రదర్శించనున్నాడు. ఖాలిద్ సయీద్, అమినా కిషోర్‌ల ‘ఘజల్ అప్రిసియేషన్’ కార్యక్రమం ఉంది. దీంతో పాటు ‘విమెన్స్ పొయెట్రీ ఇన్ ఉర్దూ’ అనే అంశం మీద సదస్సూ జరగనుంది. ఇందులో షఫీఖ్ ఫాతిమాషేరా, ఫాతిమా తాజ్, జమీలా నిషాత్‌లు పాల్గొంటున్నారు.
 
వారధిలా వేడుక..
 ఏటా ఒక్కో దేశాన్ని ఆహ్వానిస్తున్న హెచ్‌ఎల్‌ఎఫ్ (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్) ఈసారి పోలెండ్ దేశాన్ని అతిథిగా పిలుస్తోంది. ఈ ఆహ్వానం వెనకున్న ఉద్దేశం ఒక్కటే.. ఈ ఉత్సవానికి అంతర్జాతీయ హోదా కల్పించడం కోసం, మన సాహితీవేత్తలు.. ప్రచురణ కర్తలకు, విదేశీ సాహితీవేత్తలు.. ప్రచురణకర్తలకు మధ్య వారధిలా నిలవడం! పోలెండ్ నుంచి ముగ్గురు రచయితలు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
 
70 ఈవెంట్లు
ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు, రైటర్ మహేశ్ భట్, లీలాశామ్సన్‌లు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ రోజు తప్పించి మిగిలిన మూడు రోజుల్లో 70 ఈవెంట్ల వరకూ జరగనున్నాయి. వీటిలో పిల్లలకు స్టోరీటెల్లింగ్, స్టోరీ రైటింగ్ వర్క్‌షాప్‌లు, లిటరరీ క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి.
 
సాంస్కృతిక సంగమం..
 సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ కథక్ నర్తకి మంగళాభట్ నృత్యం, ఖవ్వాలీ, కవితా పఠనం ఉన్నాయి. ఆర్ట్ హిస్టారియన్, క్యూరేటర్ కొయిలీ ముఖర్జీ ఘోష్ ‘నాట్ ఎ టైగర్’ అనే వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. ‘గీతా ట్రాన్స్‌లేషన్స్’ పేరుతో మణీరావు అనువాదాల్లోని విధానాలను వివరించనున్నారు. హైదరాబాద్ నేటివిటీకి కెమెరా పట్టిన లక్ష్మీప్రభల ‘అబ్సల్యూట్ హైదరాబాద్ .. అన్‌చేంజింగ్ సైడ్ టు ఎ సిటీ ఆఫ్ చేంజ్’ అనే ఛాయాచిత్ర ప్రదర్శనా ఉంది. అలాగే జి.శంకర్‌నారాయణ్ ‘హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ.. లిటిల్ నోన్ ఆర్కిటెక్చరల్ జెమ్స్’ పేరుతో తెలంగాణ హెరెటేజ్, ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. తెలంగాణ కవిత్వానికీ చోటుంది. విమెన్ అండ్ లా.. ఇందులో ఇందిరా జైసింగ్, పద్మినీ స్వామినాథన్, కల్పనా కన్నబీరన్‌లు పాలుపంచుకుంటున్నారు.
 
సాహిత్యానికి, కళలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే లె క్చర్స్, డిమాన్ స్ట్రేషన్స్, యూరోప్, ఇండియాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే సాహిత్య గోష్ఠులు, స్క్రీనింగ్స్.. ఇలా సాహిత్యాభిలా షుల తృష్ణను తీర్చేవెన్నో కార్యక్రమాలు ఈ ఉత్సవంలో ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement