
కుషాయిగూడలోని శాంతివనంలో సాయి కిరణ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం
హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకున్న కాల్పుల్లో మృతిచెందిన సాయికిరణ్‌గౌడ్ అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్లో ముగిశాయి. కుషాయిగూడలోని శాంతివనంలో కుటుంబ సభ్యులు, ఆప్తులు అశ్రునయనాలతో సాయికిరణ్కు తుదివీడ్కోలు పలికారు. ఈ రోజు వేకువజామున అధికారులు సాయి కిరణ్ మృతదేహాన్ని ఆయన స్వగృహానికి చేర్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనచారి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్తోపాటు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు సాయి కిరణ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
హైదరాబాద్కు చెందిన సాయికిరణ్ (21) ఉన్నత విద్య కోసం 45 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. అయితే ఫ్లోరిడాలోని మియామిలో స్నేహితులతో కలసి వెళ్తున్న సాయికిరణ్ని.... నల్లజాతీయులు ఆపి.. అతడి వద్దనున్న ఐఫోన్ అడిగారు. ఐఫోన్ వారికి ఇచ్చేందుకు సాయికిరణ్ ససేమీరా అన్నారు. దాంతో ఆగ్రహించిన నల్లజాతీయులు అతడిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సాయికిరణ్ అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటన జూలై 14న చోటు చేసుకుంది.