మానసిక వ్యాధులను నయం చేసే సైకియాట్రిస్టు | Saikiatristu to treat psychiatric disorders | Sakshi
Sakshi News home page

మానసిక వ్యాధులను నయం చేసే సైకియాట్రిస్టు

Published Sat, Oct 11 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

మానసిక వ్యాధులను నయం చేసే సైకియాట్రిస్టు

పద్మ వయసు 55. బయటకు వెళ్లడానికి భయపడుతుంది. వీధి కుక్కలు, పక్షులు, ఆవులను చూసి బెదిరిపోతుంది. కుక్కలు ఆమెను కరిచినట్లుగా, పక్షులు ఆమె మీద రెట్ట వేసినట్లు ఊహించుకుంటుంది. ఆమె తమ్ముడు సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లేవరకు ఆమె 12 ఏళ్లుగా ఇళ్లు దాటడం లేదు.

హరీశ్ వయసు 45. అతను లిఫ్టు ఎక్కడానికి భయపడుతుంటాడు. 13వ అంతస్థులో ఉన్న తన కార్యాలయానికి మెట్ల మీదుగా రోజూ నడిచే వెళతాడు కానీ లిఫ్టు వాడడు. దీంతో హరీశ్ భార్య.. అతడ్ని సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లింది. వీరిద్దరికి సైకియాట్రిస్టు కౌన్సెలింగ్ ఇవ్వడంతో క్రమంగా ఇద్దరిలో మార్పు వచ్చింది. పద్మ ఇప్పుడు జూపార్కులకు కూడా వెళుతుంది. హరీశ్ కూడా లిఫ్టు వాడుతున్నాడు. ఇది సైకియాట్రిస్టు ప్రభావవంతమైన కౌన్సెలింగ్‌తోనే సాధ్యపడింది. సైకోథెరపీలో భాగమైన బిహేవియర్ థెరపీతో వారిద్దరూ తమ సమస్యలను అధిగమించారు. ఇలా వివిధ సమస్యలతో బాధపడేవారికి వైద్యం అందించేవారే.. సైకియాట్రిస్టులు. వివిధ రకాల వ్యక్తుల్లో వచ్చే మానసిక వ్యాధులను సైకియాట్రిస్టులు పోగొట్టాలి. ఈ నేపథ్యంలో సైకియాట్రిస్టులకు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వీరికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి.  
 
 పనివేళలు:

సాధారణంగా సైకియాట్రిస్టుల పనివేళలు ఈ విధంగా ఉంటాయి. ఉదయం 9: ఆస్పత్రికి చేరుకోవాలి. 10 గంటలకు రోగులను పరీక్షించాలి. మధ్యాహ్నం ఆస్పత్రి సంబంధిత పని ఉంటుంది. ఒంటి గంటకు భోజనం. రెండు గంటలకు స్పెషాలిటీ క్లినిక్స్‌ను సందర్శించాలి. 4.30 గంటలకు సంబంధిత పేషెంట్ల సమస్యలపై చర్చలు, సమావేశాలు ఉంటాయి. 7 గంటలకు విధులు ముగుస్తాయి. అయితే సొంతంగా క్లినిక్‌ను ఏర్పాటు చేసుకునేవారు ఏ సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకేసారి రెండు, మూడింటిలో పనిచేసేవారి విధుల్ని బట్టి సమయపాలన ఆధారపడి ఉంటుంది.
 
కెరీర్:

వివిధప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేకంగా సైకియాట్రిస్టులను నియమించు కుంటున్నాయి. వివిధ స్వచ్చంధ సంస్థల్లో కూడా సైకియాట్రిస్టులకు అవకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. సొంతంగా క్లినిక్‌ను నిర్వహించుకోవచ్చు.

వేతనాలు:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు అందుకోవచ్చు. కొన్నేళ్ల అనుభవంతో నెలకు రూ. 80 వేల నుంచి రూ.90 వేల వరకు వేతనాలు లభిస్తాయి. పనితీరు, అనుభవంతో నెలకు రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు సంపాదించే వారున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మంచి జీతాలు పొందొచ్చు. మంచి ప్రాక్టీస్‌తో సీనియర్ డాక్టర్ స్థాయికి చేరుకున్నవారు నెలకు రూ. 2.5 ల క్షల వరకు ఆర్జిస్తున్నారు.
 
 కావాల్సిన నైపుణ్యాలు: 

ఠి పేషెంట్ చెప్పేది చక్కగా వినాలి. ఠి ఎక్కువ ఓర్పు కావాలి. ఠి రోగి సమస్యను అవగాహన చేసుకుని విశ్లేషించగల సామర్థ్యం ఉండాలి. ఠి పేషెంట్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబర్చాలి.  ఠి కొన్ని గంటలపాటు వారితో ఓపికగా మాట్లాడాలి.
 
 అర్హతలు:

 సైకియాట్రీ కోర్సులు చదవాలనుకునేవారు ముందుగా ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ టెస్టులు రాసి ఎంబీబీఎస్‌లో చేరొచ్చు. తదుపరి సైకియాట్రీలో పీజీ లేదా డిప్లొమా చేయొచ్చు. రెండేళ్ల డిప్లొమా కోర్సు (డీపీఎం)లోనూ, మూడేళ్ల డీఎన్‌బీ/ఎండీలోనూ సైకియాట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చైల్డ్ సైకియాట్రీ, జెరియాట్రిక్ సైకియాట్రీ, ఫోరెన్సిక్ సైకియాట్రీ వంటి స్పెషలైజేషన్లను విదేశాల్లో అభ్యసించవచ్చు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement