ఫీజు టై | school education center. Half a million | Sakshi
Sakshi News home page

ఫీజు టై

Published Sat, Jun 11 2016 12:19 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజు టై - Sakshi

ఫీజు టై

ప్రైవేటు స్కూళ్ల ధనదాహం
పాఠశాల చదువులకే రూ. అరకోటి
ఈ ఏడాది 30 శాతం వరకు పెంపు..
తల్లిదండ్రులపై  రూ.1100 కోట్ల అదనపు భారం

 

సిటీబ్యూరో: పిల్లాడికి నాలుగు అక్షరం ముక్కలు నేర్పించాలంటే ఫీజుల కోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రైవేటు స్కూలు పేరు చెబితే.. చిన్నారి చదువు మాట అటుంచి ఫీజులు చూసి బెంబేలెత్తుతున్నారు. తాజా (2016-17) విద్యాసంవత్సరానికి మరింత భారం పడుతుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఫీజులతో పోల్చితే స్కూళ్ల యాజమన్యాలు ఈ ఏడాది 10 నుంచి 30 శాతం వరకు పెంచేశాయి. ఒక్క బ్రాంచ్‌కే పరిమితమైన స్కూళ్లు.. కనీసం 10 నుంచి 15 శాతం పెంచగా.. కార్పొరేట్ స్కూళ్లు గరిష్టంగా 30 శాతం అదనపు భారం మోపాయి. ఇక సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ బోధిస్తున్న స్కూళ్లలో ఫీజుల మాట వింటే దడ పుడుతోంది.

 
ఫీజు దోపిడీకి ఓ ఉదాహరణ ఇది..

హిమాయత్‌నగర్‌కు చెందిన రిషితేష్.. కొండాపూర్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేరాడు. ఆ సమయంలో ప్రీ ప్రైమరీకి ఆ స్కూల్ తీసుకున్న ఫీజు రూ. లక్ష. ఆ తర్వాత ఏటా సరాసరి 15 శాతం ఫీజును పెంచుతూ వచ్చింది. నర్సరీలో ఆ విద్యార్థి రూ. 1.15 లక్షలు చెల్లించక తప్పలేదు. ఇలా ఐదో తరగతిలో రూ. 2.68 లక్షలు, పదో తరగతిలో  రూ. 6.70 లక్షలు, 12వ తరగతి వచ్చేసరికి రూ. 8.69 లక్షలను యాజమాన్యం వసూలు చేసింది. అంటే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి పూర్తయ్యేసరికి సదరు విద్యార్థి 14 ఏళ్లలో రూ. 50.19 లక్షలు ధారపోయక తప్పలేదు. ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ నియంత్రణ, అజమాయిషీ లేకపోవడంతో ఈ స్థాయిలో దోపిడీ జరుగుతోందన్నది తెలిసిందే. ఒకవైపు ఫీజుల నియంత్రణ కోసం నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా యాజమాన్యాలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఫీజులను నియంత్రిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అమలులో కనిపించలేదు.

 

ప్రవేశానికే రూ. 1.30 లక్షలు
గచ్చిబౌలిలోని ఓ స్కూల్‌లో ప్రవేశం పొందాలంటే అక్షరాలా రూ. 1.30లక్షలు కట్టాల్సిందే. దీంతోపాటు వార్షిక ఫీజు రూ. 25వేలు, ట్యూషన్ ఫీజు రూ. 20వేలు, సెక్యూరిటీ డిపాజిట్ రూ. 40 వేలు, రిక్రియేషన్ ఫీజు రూ. 8 వేలు.. ఇలా మొత్తం రూ. 1.90లక్షలు ఒక్క ఏడాదికే వసూలు చేస్తుండడం విస్మయం గొల్పుతోంది. పేరుగాంచిన అన్ని స్కూళ్లలో దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

 

అదనపు భారం రూ. 1,100 కోట్లు
నగరంలో దాదాపు 3,500 వేలకు పైగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఒక్క బ్రాంచ్‌కే పరిమితమైనవి, సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి ఏడాదికి సగటున స్కూలు ఫీజుగా రూ. 50 వేలు చెల్లిస్తున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి యాజమాన్యాలు దండుకుంటున్న మొత్తం రూ.7,500 కోట్లు. ఈ ఏడాది సరాసరి 15 శాతం ఫీజులు పెరిగాయి. ఈ లెక్కన రూ. 1,125 కోట్ల భారం తల్లిదండ్రులపై అదనంగా పడినట్లే.

 

 

ఫీజు దోపిడీని నిరసిస్తూ నేడు ధర్నా
ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లలో ఫీజు దోపిడీని అరికట్టాలన్న డిమాండ్‌తో శనివారం స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయనున్నారు. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొననున్నారు. ఫీజుల నియంత్రణకు ఎన్ని జీఓలు, చట్టాలు వచ్చినా బుట్టదాఖలు అవుతున్నాయని ఆ జేఏసీ అధికార ప్రతినిధి శివ మకుటం పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇప్పటి కే ఎన్నో రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ధర్నాకు పిలుపునిచ్చినట్లు ఆయన వివరించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు.. ఫీజు దోపిడీ బాధితులేనని, అటువంటి వారందరూ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement