జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత.. మనం ఆ స్థాయికి రావడానికి కారణమైన గురువులను, విద్యాలయాలను మరిచిపోవద్దని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.
ముషీరాబాద్/హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత.. మనం ఆ స్థాయికి రావడానికి కారణమైన గురువులను, విద్యాలయాలను మరిచిపోవద్దని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఆయా విద్యాలయాలకు ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. ఏటా గాంధీ జయంతి రోజున నిర్వహించే కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫ్రాటెర్నిటీ (పూర్వ విద్యార్థుల సంఘం) వార్షిక సమావేశం బుధవారం నారాయణగూడలోని కేశవస్మారక కళాశాల హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐటీ, రిజర్వ్‌బ్యాంక్, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కుటుంబ సమేతంగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిల్వర్ జూబ్లీ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థి అయిన కృష్ణారావు ప్రసంగిస్తూ.. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటునందించాలని కోరారు. మనం అందించే చిన్న సహకారం పరోక్షంగా ఎంతో మంది పేద విద్యార్థులకు గొప్ప సహాయంగా ఉపయోగపడుతుందన్నారు. ఫ్రాటెర్నిటీ అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కె.జనార్ధన్ సంఘం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
కళాశాల పూర్వ విద్యార్థులు పొట్ల మాదవరావు, ఆర్వీ శేషారెడ్డి గతేడాది అందించిన ఆర్థిక సహాయం వల్ల ఇద్దరు విద్యార్థులకు ఈ ఏడాది అవార్డులు, పురస్కారాలు అందించామన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోగా, దాతలు ఇచ్చిన రూ.1.50 లక్షలతో అతనికి రోబో కాలును అందజేసినట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు రూ.600 నుంచి రూ.1050కి పెరిగాయని, ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్‌లు డాక్టర్ పీవీ రమేష్, కె.సునీత, ఆజయ్‌మిశ్రాల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో మహిళలకు ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏడాది ఎంపిక చేసిన 14 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, నగదు పురస్కారాలను గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందజేశారు. ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్‌ఖాదర్, సాక్షి బిజినెస్ స్పెషల్ కరస్పాండెంట్ డి.శివరామిరెడ్డి, సంఘం ముఖ్య ప్రతినిధులు సంపత్‌రెడ్డి, మల్లికార్జున్, లక్ష్మణ్‌రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ మిమిక్రి ఆర్టిస్టు, సినీ నటుడు శివారెడ్డి తన మిమిక్రితో సభలో నవ్వులు పూయించారు. పూర్వ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.