
ఎస్‌డీఎఫ్ నిధుల కేటాయింపు సీఎం ఇష్టం
ఏసీడీపీ తిరిగి పెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేసిన మంత్రి యనమల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం (ఏసీడీపీ) పెట్టే ప్రసక్తే లేదని, ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కేటాయింపులు ముఖ్యమంత్రి ఇష్టమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కాదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యేల పేరుతో ఎస్‌డీఎఫ్ నిధులు విడుదల చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని ప్రతిపక్ష నేత, సభ్యులు బుధవారం అసెంబ్లీలో చేసిన విమర్శలకు మంత్రి యనమల ఈమేరకు వివరణ ఇచ్చారు.
ఎస్‌డీఎఫ్ విడుదలకు మార్గదర్శకాలేవీ లేవని ఎవరైనా సీఎంను కలసి పనుల కోసం ప్రతిపాదనలు ఇస్తే రూ. 2 కోట్లు వరకూ ఇస్తున్నారని తెలిపారు. ఎస్‌డీఎఫ్ కింద 74 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సుమారు రూ. 2 కోట్లు చొప్పున రూ. 146.48 కోట్లు, ఇతరులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాని వారికి) 24 మందికి 54 కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఎస్‌డీఎఫ్ కింద నిధులు పొందిన వారి పేర్లు సభకు సమర్పించినందున వాటిని చదవడానికి వీలు లేదంటూ ప్రతిపక్ష నాయకుడి ప్రసంగానికి కూడా ఆయన స్పీకరు ద్వారా అడ్డుకట్ట వేయించారు. ‘ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో ఏసీడీపీకి నిధులు పెట్టలేదు.
వచ్చే సంవత్సరం కూడా పెట్టేది లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. ఇది ప్రభుత్వ పాలసీ’ అని యనమల స్పష్టం చేశారు. ‘ఏసీడీపీ ఎందుకు అడుగుతున్నారో తెలుసు. ఈ అస్త్రాన్ని వినియోగించుకుని వాళ్ల మనుషులు (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు) ఇటు (టీడీపీ)వైపు రాకుండా చేసుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అస్త్రం పనిచేయదు. అందుచేత వారు వీరయ్యే అవకాశం చాలా దగ్గరలో ఉంది’ అని యనమల వ్యాఖ్యానించారు.