భద్రతకు భరోసా లేని ప్రయాణం! | Security drought to the female passenger in the train's,Railway stations | Sakshi
Sakshi News home page

భద్రతకు భరోసా లేని ప్రయాణం!

Published Sun, Sep 10 2017 1:48 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

భద్రతకు భరోసా లేని ప్రయాణం!

భద్రతకు భరోసా లేని ప్రయాణం!

- రైళ్లలో తూతూ మంత్రంగా గస్తీ 
మహిళా ప్రయాణికులకు భద్రత కరువు 
అవగాహన లేక అక్కరకురాని టోల్‌ఫ్రీ నంబర్లు 
 
సాక్షి, హైదరాబాద్‌: రైళ్లు, రైల్వే స్టేషన్లు పోకిరీలకు అడ్డాగా మారాయి. ప్రయాణికుల భద్రత గాల్లో దీపమయింది. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు ప్రవేశపెట్టిన టోల్‌ఫ్రీ నంబర్, మొబైల్‌ అప్లికేషన్లపై అవగాహన కరువై ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఇటీవల మిలీనియం, చెన్నై ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో వరుసగా చోటుచేసుకున్న సంఘటనలు మహిళా ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న ముగ్గురు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను పోకిరీలు వేధించిన సంఘటన ఇటీవల సంచలనం సృష్టించింది.

పోకిరీల వేధింపులు భరించలేక ఆ ముగ్గురిలో ఒక మహిళ సింగరాయకొండ స్టేషన్‌ వద్ద రైల్లో నుంచి దూకి గాయాలపాలైంది. పోకిరీల బారి నుంచి రక్షణ కోసం వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్, మొబైల్‌ యాప్‌లపై అవగాహన లేకపోవ డంతో అవి అక్కరకు రాలేదు. మరో ఘటనలో... చెన్నై నుంచి కాచిగూడకు వచ్చిన ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌లోని కొందరు మహిళల మంగళసూత్రాలు అపహరణకు గురయ్యాయి. పట్టపగలే ఇలాంటి అకృత్యాలు జరగడం మహిళా ప్రయాణికులకు రైల్లో ఎంత భద్రత ఉందో అర్థమవుతోంది. ఈ రెండు ఘటనల్లోనూ ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నేరస్తులను పట్టుకున్నప్పటికీ.. ముందస్తు భద్రత మాత్రం లేకుండాపోయింది. 
 
అటకెక్కిన ‘రిస్తా’... 
రిస్తా (రైల్వే ఇంటరాక్టివ్‌ సెక్యూరిటీ సొల్యూషన్‌ ఫర్‌ ట్రావెలర్స్‌ అసిస్టెన్స్‌) యాప్‌ను ఎంఎంటీఎస్‌ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టారు. ఈ యాప్‌లో ‘హెల్ప్‌’బటన్‌ నొక్కి, తమ ఫిర్యాదు వివరాలు ఎస్సెమ్మెస్‌ చేస్తే.. సికింద్రాబాద్‌లోని ఆర్‌పీఎఫ్‌ కంట్రోలింగ్‌ కేంద్రం తగిన భద్రతా చర్యలను చేపడుతుంది. నిర్భయ ఉదంతం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ యాప్‌ మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. 182 నంబర్‌ అందుబాటులోకి రావడంతో ప్రారంభించిన ఏడాది లోపే ఈ యాప్‌ను నిలిపివేశారు. 
 
సదుపాయాలున్నా... 
ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, భద్రతాపరమైన అంశాలపై ఫిర్యాదు కోసం మరో టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా రైల్వే తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ 8121281212కు ప్రయాణికులు ఎస్సెమ్మెస్‌ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. వైద్యం, ఆహారం, బోగీ పరిశుభ్రతకు సంబంధించి 138 నంబర్‌ అందు బాటులో ఉంది. వీటి గురించి అతి కొద్ది మందికే అవగాహన ఉంది. సింగరాయ కొండ వద్ద మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో నుంచి దూకిన మహిళ ఉదంతంలోనూ ఈ నంబర్లపై అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమని ఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రైల్లో వారు 182కు కాకుండా 100కు డయల్‌ చేశారు. దీంతో సరైన స్పందన లభించలేదు.
 
రాత్రి వేళల్లోనే గస్తీ... 
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజూ సుమారు 150 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మరో 100కు పైగా ప్యాసింజర్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు సిటీలో అందుబాటులో ఉన్నాయి. రోజుకు 3.5 లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లలో సగానికి పైగా పగటిపూట బయలుదేరేవే. కానీ రైల్వే భద్రతా వ్యవస్థ ఎక్కువ శాతం రాత్రి వేళలకే పరిమితమైంది. పగటిపూట భద్రతా సిబ్బంది రైల్వేస్టేషన్లకే పరిమితమవుతోంది. దీంతో పోకిరీలు, దొంగలు, అసాంఘిక శక్తులు పగటిపూట రైళ్లలో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.

ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు మచ్చుకైనా కనిపించడంలేదు. ఇక 2015లో మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ 182 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే... సమీపంలోని డివిజినల్‌ కార్యాలయం వెంటనే ఆర్‌పీఎఫ్‌ను అప్రమత్తం చేస్తుంది. అయితే దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో ఈ సేవలు అధిక శాతం మంది ప్రయాణికులు ఉపయోగించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement