అమల్లో అంతంతే! | Self-employed for the fabrication of weaker sections Implemented | Sakshi
Sakshi News home page

అమల్లో అంతంతే!

Published Fri, Aug 26 2016 2:57 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

అమల్లో అంతంతే!

అమల్లో అంతంతే!

సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీనవర్గాలకు స్వయం ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏటా పడకేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రాయితీ పథకాలు ఈ ఏడాది సైతం లబ్ధిదారుల కు అందుబాటులో లేకుండా పోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బలహీనవర్గాల కోసం 50-80 శాతం (రూ.లక్ష-10 లక్షల రుణాలకు) రాయితీతో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని 2015-16లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వ్యక్తిగత రుణాల కేటగిరీలో రూ.లక్ష రుణానికి 80 శాతం, రూ.2 లక్షలకు 70 శాతం, రూ.3 లక్షల-10 లక్షల రుణానికి 50 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది.

అయితే, అమలులోకి వచ్చేసరికి ఈ రుణాల పంపిణీ పథకాలు నీరుగారిపోతున్నాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. 2015-16కి సంబంధించి లక్ష్యాలను గమనిస్తే కేవలం 30 శాతంలోపు రుణాల పంపిణీ మాత్రమే జరిగింది. 2016-17కు సంబంధించిన రుణాల ప్రక్రియ ఇంత వరకు ప్రారంభం కాకపోవడం గమనార్హం. మరోవైపు ఈ రుణాల కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు.
 
కేటాయింపులున్నా.. అందని నిధులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల రుణాల కోసం 2015-16లో ఏకంగా 5,36,663 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ ఆన్‌లైన్ బె నిఫిషియరీ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) రికార్డులు పేర్కొంటున్నాయి. ఇందులో మైనారిటీలు (క్రిస్టియన్లు సహా) 1,58,313, ఎస్సీలు 1,50,227, బీసీలు 1,51,000, ఎస్టీలు 71,981 మంది దర ఖాస్తు చేసుకున్నారు. 2015-16కు సంబంధించి సంక్షేమ శాఖల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. 52,835 మంది ఎస్సీలు, 27,428 మంది బీసీలు, 9,500 మంది మైనారిటీలు, 8,732 మంది ఎస్టీలకు రుణాలు ఇవ్వాల్సి ఉంది.

దీనికోసం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసిన ప్రభుత్వం వాస్తవానికి వచ్చేసరికి నిధులను పూర్తిగా విడుదల చేయకపోవడంతో బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకాలు నీరుగారిపోతున్నాయి. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో గతేడాది ప్రభుత్వం కొంత మేరే విడుదల చేయగా, అందులో సైతం ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నిధులు పీడీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అయినట్లు ప్రకటించడంతో మురిగిపోయాయి. ఇక 2015-16లో మిగిలిపోయిన రుణాలు చెల్లించేందుకు 2016-17 బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఉపయోగించుకోవచ్చునని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనితో 2016-17లో ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాల్లో కోత పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement