స్వయం ఉపాధి రుణాలు ఎండమావే! | Self-employed loans mirage! | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి రుణాలు ఎండమావే!

Published Sun, Apr 17 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

స్వయం ఉపాధి రుణాలు ఎండమావే!

స్వయం ఉపాధి రుణాలు ఎండమావే!

బడుగులకు భరోసానివ్వని  ‘స్వయం ఉపాధి’ పథకాలు
ఎస్సీ లబ్ధిదారులకు నామమాత్రంగా రూ. 36 కోట్లు విడుదల
ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు

 

హైదరాబాద్: రాష్ట్రంలో స్వయం ఉపాధి రుణాలు ఎండమావిగా మారుతున్నాయి. ఆర్థిక స్వావలంబనకు సంక్షేమ రుణాలు అందక బడుగు, బలహీన వర్గాలు విలవిల్లాడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా నూతన రాయితీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం రికార్డు స్థాయిలో 5,36,663 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయా కార్పొరేషన్ల కార్యాచరణ ప్రణాళికలకు అనుగుణంగా దాదాపు లక్ష మందికి ఈ రుణాలు లభించే అవకాశముంది. మార్చి31 కల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందజేసి ఆయా యూనిట్లను ప్రారంభించాల్సి ఉండగా ఎస్సీ కార్పొరేషన్ నామమాత్రంగా రూ. 36 కోట్లు లబ్ధిదారులకు విడుదల చేసింది. బీసీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు ఇంకా నిధులు విడుదల కాలేదు.

 
రుణ లక్ష్యాలకు దూరంగా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్లు, 11 బీసీ ఫెడరేషన్లకు మొత్తం 5,36,663 దరఖాస్తులు అందగా అందులో అత్యధికంగా మైనారిటీల (క్రిస్టియన్లు కలుపుకొని) నుంచి 1,58,313 మంది, ఎస్సీల నుంచి 1,50,227 మంది, బీసీల నుంచి 1,51,000 మంది, ఎస్టీల నుంచి 71,981 మంది రుణాల కోసం దర ఖాస్తు చేసుకున్నారు. అయితే 2015-16కు గాను సంక్షేమ శాఖలు విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 52,835 మందికి (భూపంపిణీతో కలిపి), బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా 27,428 మందికి, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 9,500 మందికి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 8,732 మందికి రుణాలు ఇవ్వాలని నిర్దేశించుకున్నారు.

 ఎస్సీ కార్పొరేషన్ మినహా...


రాష్ర్ట ప్రభుత్వం ఎస్సీ కార్పొరే షన్ (భూపంపిణీ కలుపుకుని) రుణాల కోసం రూ. వెయ్యికోట్లు, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల రుణాల కోసం రూ. 261 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ కోసం రూ. 95 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ కోసం రూ. 35 కోట్లు కేటాయించింది. అయితే ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. వెయ్యికోట్లకుగాను రూ. 500 కోట్లకు బీఆర్వోలిచ్చి రూ. 250 కోట్లు మాత్రం (భూపంపిణీకి రూ. 214 కోట్లు, స్వయం ఉపాధికి రూ. 36 కోట్లు) విడుదల చేశారు. కేవలం ఎస్సీల స్వయం ఉపాధి రుణాల కోసం రూ. 400 కోట్ల వరకు అవసరం కాగా పదోవంతుకన్నా తక్కువగానే సబ్సిడీ మొత్తం లబ్దిదారులకు చేరింది. బీసీ కార్పొరేషన్ ద్వారా 592 మంది లబ్ధిదారులకు రూ. 5 కోట్ల మేర రుణాలు మంజూరు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నా ఈ నిధులు ఇంకా ఆర్థికశాఖ నుంచి విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. మైనారిటీ కార్పొరేషన్ రూ. 95 కోట్లకుగాను ఇంకా లబ్ధిదారుల ఖాతాలలో రాయితీ మొత్తాన్ని జమ చేయడం ప్రారంభించలేదు. ఎస్టీ కార్పొరేషన్ తీరు కూడా ఇంచుమించుగా ఇదే రీతిగా ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement