హెచ్సీయూలో శివలింగం ప్రత్యక్షం
రాజ్యాంగ విరుద్ధం : విద్యార్థి జేఏసీ
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హఠాత్తుగా శివలింగం, నంది, నాగ ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. గతంలో వాటిని అక్కడ చూడలేదని, హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాయో అర్థం కావడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. క్యాంపస్ పరిధిలోని మెయిన్ గేట్ వెలుపల రాత్రికి రాత్రి విగ్రహాలు వెలియడం చర్చనీయాంశంగా మారింది. లౌకికత్వానికి ప్రతీకగా నిలవాల్సిన వర్సిటీల్లో దేవుడి విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైంది కాదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ విగ్ర హం ఏర్పాటుకు అనుమతించని అధికారులు, ఒక మతానికి సంబంధించిన విగ్రహాలను ఎలా కొనసాగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూనే మరోవైపు అంబేడ్కర్ గుర్తులు లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారని వారు పేర్కొన్నారు. క్యాంపస్‌లో నిర్భందాన్ని ప్రయోగిస్తూ ఒక వర్గం అభిప్రాయాలు, భావాలను అందరిపై రుద్దడం సరి కాదన్నారు.