హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ సిటీ: కేరళకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి కిరణ్ కిషోర్‌పై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రా వేధింపులకు పాల్పడుతున్నాడని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోని పరిపాలన విభాగంలోని వైస్ ఛాన్స్‌లర్ కార్యాలయం ఎదుట గురువారం విద్యార్థులు బైఠాయించారు.
ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రాను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మట్లాడుతూ... స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లోని న్యూరల్, కాగ్నెటివ్ సైన్స్ విభాగాధిపతి రమేష్ కుమార్ మిశ్రా పీహెచ్‌డీ విద్యార్థి కిరణ్ కిషోర్‌ను కొంత కాలంగా వేదిస్తున్నాడని పేర్కొన్నారు. విద్యార్థి రాసిన పరిశోధన ప్రాజెక్టును వేరే విద్యార్థిగా చూపించి గందరగోళం సృష్టించాడని విద్యార్థి నాయకుడు ఆరోపించాడు. పరిశోధనలో ఆటంకాలు కల్పిస్తున్న ప్రొఫెసర్ మిశ్రాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై నియమించిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక అందించలేదని తెలిపారు. సంఘటన స్థలానికి హెచ్‌సీయూ వైస్ ఛాన్స్‌లర్ హరిబాబు చేరుకుని విద్యార్థులతో చర్చించి వెంటనే కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటామని హామిచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.